CM Revanth Reddy: రేవంత్‌ ముందు రుణమాఫీ సవాల్‌.. అంత ఈజీగా అయ్యేనా?

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ఎన్నిల సమయంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా చేరారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది.

Written By: Raj Shekar, Updated On : May 18, 2024 3:14 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: దాదాపు నెల రోజులపాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో పాలన దాదాపుగా నిలిచిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచార సభలు నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. దీంతో పాలనపై దృష్టిపెట్టలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే మాజీ మంత్రి హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆగస్టు 15 లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్‌ చేశారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు పాలనతోపాటు రుణమాఫీపై దృష్టిపెట్టారు.

అతిపెద్ద సవాల్‌..
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి ఎన్నిల సమయంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా చేరారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. ఇప్పుడు రూ.2 లక్షలు అదీ ఒకేసారి చేయాలని రేవంత్‌ నిర్ణయించారు. ఇందుకు గడువు కూడా ఆయనే ప్రకటించారు. మూడు నెలల్లో నిధులు సమీకరించుకోవడం రేవంత్‌ ముందు ఉన్న అతిపెద్ద సవాల్‌. అయితే నిధుల విషయంలో రేవంత్‌ రెడ్డికి ఓ క్లారిటీ ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున జీతభత్యాలు తప్ప ఖజానా నుంచి ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. జూలై వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండనుంది. దీంతో అప్పటి వరకు అదనపు ఖర్చులు ఏమీ లేనందున ప్రభుత్వ ఖజానాలో రూ. 30 వేల కోట్ల మిగులు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సొమ్ములతో రుణమాఫీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆగస్టు 15న ప్రారంభించేలా..
ఆగస్టు 15న రుణమాఫీ ప్రారంభించేలా రేవంత్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట రూ.25 వేల నుంచి క్రమంగా రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. రూ.2 లక్షల రుణం తీసుకున్నవారు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున చివరికి వారి రుణాలు మాఫీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.