CM Revanth Reddy: బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటే అని తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా పనిచేసింది. దీంతో ఇటు బీజేపీ, అటు అధికార బీఆర్‌ఎస్‌కు తీవ్రంగా నష్టం జరిగింది. బీజేపీకి ఆశించిన సీట్లు రాకపోగా, బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా రేవంత్‌రెడ్డి మళ్లీ ఇదే నినాదంతో ప్రచారం చేశారు. కానీ, ఈసారి బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం జరిగింది. బీజేపీపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కూడా తెలంగాణ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై కొంత ప్రభావం చూపింది. బీజేపీకి కలిసి వచ్చింది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అయితే బీఆర్‌ఎస్ ప్రచారానికి ఓ కారణం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీతో.. సీఎం రేవంత్‌రెడ్డి వేదికను పంచుకున్నారు. వేదికపై నుంచి గుజరాత్ మోడల్ స్ఫూర్తిగా తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమయంలో రేవంత్ తన ప్రసంగంతో కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం గొడవలు పడి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇక వేదికపై మోదీని పెద్దన్నగా ప్రకటించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. ఫలితంగా అధికార కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయి.
కేంద్ర బడ్జెట్‌పై అసంతృప్తి..
ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం(జూలై 24న) అసెంబ్లీలో చర్చించారు. కేంద్రం తీరును తప్పు పట్టారు. తామేమి ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ సంపదను తెలంగాణకు కేటాయించాలని కోరడం లేదన్నారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి అధిక నిధులు వెళ్తున్నా.. తెలంగాణకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపడం సరికాదన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోదీ తెలంగాణ పర్యటనలో ప్రధానిని రేవంత్ బడేభాయ్ అని ప్రస్తావించడంతో.. రేవంత్ – మోడీ మధ్య దోస్తీ కుదిరిందని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేసింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. శాసన సభలో కేంద్రం వైఖరిపై చర్చ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి రేవంత్ పదునైన విమర్శలు చేయడంతో బీఆర్‌ఎస్ ఆరోపణల్లో పస లేకుండా పోయింది. మరోవైపు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను టార్గెట్ చేశారు. తాను తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ నుంచి సీఎం వరకు పదవుల్లో పనిచేశానని తెలిపారు. కేటీఆర్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. రేవంత్‌రెడ్డికి మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం పదవి వచ్చిందని విమర్శించారు. ఇలా ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది. బీజేపీతో బీఆర్‌ఎస్ చీటకి ఒప్పందం చేసుకుందని సీఎం ఆరోపించారు. అందుకే ఇటీవల ఢిలీ వెళ్లొచ్చారని ఆరోపించారు.
నిరూపించుకోవాల్సింది బీఆర్‌ఎస్సే..
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కేంద్రంపై తమ వైఖరి ఏమిటో స్పష్టత ఇచ్చారు. నీతి అయోగ్ సమావేశం భహిష్కరణతోపాటు అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తమ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. ఎందుకంటే.. కొన్ని నెలలుగా బీజేపీపై గులాబీ నేతలు విమర్శలు చేయడం లేదు. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంతో కూతురు అరెస్టుపై కేసీఆర్ భావోద్వేగానికి లోనైనా.. కేంద్రంలోని బీజేపీని గానీ, ప్రధాని మోదీనిగానీ పల్లెత్తు మాట అనలేదు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అసంతృప్తి వ్యక్తం చేసినా పెద్దగా విమర్శలు చేయలేదాదు. మరోపు కేటాయింపులు తగ్గడానికి రేవంత్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ఛోటేభాయ్‌కు బడేభాయ్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. తనపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలకు రేవంత్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ద్వారా నోరు మూయించారు. కానీ, బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం, పొత్తు అంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కమలంతో తమకు ఎలాంటి దోస్తాన్ లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత గులాబీ పార్టీపైనే ఉంది. ఇందుకోసం ఇప్పుడు బీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాలి.