Railway Budget 2024: ఏపీకి కేంద్రం అగ్ర తాంబూలం ఇస్తోంది. ఇప్పటికే ఏడు మాసాల బడ్జెట్లో అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. వెనుకబడిన జిల్లాలకు సైతం ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటన చేసింది. విభజిత రాష్ట్రానికి అన్ని విధాల చేయూత అందిస్తామని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ సాయం వివరాలను తెలుగులోనే వెల్లడించారు. తాజాగా రైల్వే బడ్జెట్లో సైతం ఏపీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా రూ.9151 కోట్ల రూపాయలు కేటాయించారు. కీలక ప్రాజెక్టులకు మోక్షం కల్పించారు.ఒక్క అమరావతి పరిధిలోనే రైల్వే లైన్ల అభివృద్ధికి రూ. 2,047 కోట్లు కేటాయించడం విశేషం. దీంతో అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం,అభివృద్ధి జరగనుంది. బడ్జెట్ కేటాయింపులతో పని లేకుండా ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. భూ సేకరణతో పాటు రహదారుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని స్పష్టం చేసింది. ఇప్పుడు రైల్వే లైన్ల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో అమరావతి రాజధానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అయితే ఒక్క అమరావతికే కాదు. ఏపీవ్యాప్తంగా రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణకు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం విశేషం. గత పదేళ్ల బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్ లో కూడా ఇంతలా కేటాయింపులు చేయలేదు.
* అమలు కాని విభజన హామీలు
2014లో రాష్ట్ర విభజన జరిగింది. 13 జిల్లాలతో ఏపీ మిగిలింది. కానీ కీలకమైన రైల్వే ప్రాజెక్టులు, ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. వాస్తవానికి విభజన హామీలలో చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తగినంత చొరవ చూపలేదు. గత రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ కారణంగానే ఏపీని పక్కన పెట్టినట్లు విమర్శలు ఉన్నాయి. కానీ ఈసారి ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకం. అందుకే బడ్జెట్ కేటాయింపుల నుంచి ప్రత్యేక నిధులు వరకు ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* తెరపైకి విశాఖ రైల్వే జోన్
ఈసారి రైల్వే బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ అంశం సైతం తెరపైకి వచ్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రస్తావించారు కూడా. రైల్వే జోన్ కావాలంటే విశాఖలో రైల్వేకు భూములు కేటాయించాలి. కానీ జగన్ సర్కార్ సమకూర్చలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి రిజర్వాయర్ పరిధిలో ఉండడంతో.. అది నిబంధనల ప్రకారం పనికిరాదు. కానీ వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూర్చితే తాము రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది కూడా ఒక రకమైన శుభ పరిణామమే.
* వైసిపి హయాంలో అంతంత మాత్రమే
గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు అంతంత మాత్రమే. కేవలం జగన్ సర్కార్ రుణ పరిమితులు పెంచుకునేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు ఉన్నాయి. కానీ తాజా కేటాయింపులు చూస్తుంటే ఏపీ విషయంలో కేంద్రం ఆలోచన మారినట్లు స్పష్టమైంది. ఇదే పరంపర మరో నాలుగేళ్లపాటు కొనసాగితే ఏపీ సమగ్ర అభివృద్ధి ఖాయం.