CM Revanth Reddy: రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలయింది. మద్రాసు నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడి చాలా సంవత్సరాలయింది. ఇన్ని సంవత్సరాల పరిపాలన కాలంలో ఎంతోమంది నాయకులు తమ నాయకత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. రెండు తెలుగు రాష్ట్రాలను సుభిక్షం చేశారు.
Also Read: నా బ్రాండ్ ఇదే.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!
రాజకీయాలు..ఎత్తులు,పై ఎత్తులు.. తిట్లు.. విమర్శలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు.. ఈ విషయాలను కాస్త పక్కన పెడితే పేదవాళ్లకు కాస్త మంచి చేసి.. వారికి సర్కార్ పై నమ్మకం కలిగించే లాగా పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాకపోతే ఆ పథకాల పేరు చెబితే తాము మాత్రమే కనిపించే విధంగా వారు ముద్ర వేసుకున్నారు. సరే సంక్షేమ పథకాలు మంచివా? అవి పేదవారికి వెళ్తున్నాయా? మధ్యలో అధికార పార్టీ నాయకులు నొక్కడం లేదా? అనే ప్రశ్నలను కాస్త పక్కన పెడితే కొంతలో కొంత పేదవాళ్లకు ఆ పథకాలు న్యాయం చేశాయి.. వారి బతుకులను మార్చాయి అని చెప్పవచ్చు..
ఎందుకింత పక్షపాతం
అనుమానమే లేదు.. ఇప్పటికి రేషన్ బియ్యం పేరు చెప్తే కచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టారు. అపధకం ఎంతో మంది పేదలకు అన్నపూర్ణగా నిలిచింది. ఎంతో విజయవంతమైంది. ఏ పేదవాడు కూడా పస్తులతో పడుకోవద్దని నాడు సీనియర్ ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాకపోతే కిలో రెండు రూపాయలు కాస్త ఉచితమైపోయింది. అంటే నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పేదలు ఇంకా ఉన్నారా? లేక పెరిగారా? అనే ప్రశ్నలకు పెరిగిన రేషన్ కార్డులే సమాధానంగా ఉన్నాయి. ఇక ఐటీ విప్లవాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు రాళ్లగుట్టల మాదిరిగా ఉన్న సైబరాబాద్, మాదాపూర్ ప్రాంతాలు.. నేడు తెలంగాణ బడ్జెట్ కు చోదక శక్తి లాగా నిలుస్తున్నాయి అంటే దానికి కారణం ఐటీ విప్లవం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐటీ ద్వారా లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. పరోక్షంగా అంతకు మించిన స్థాయిలో ఉపాధి దొరుకుతోంది. ఇక ఆరోగ్య శ్రీ గురించి ప్రస్తావన వస్తే.. అ గౌరవం ముమ్మాటికి వైయస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్లకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దుకున్న ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పథకాల పేర్లు చెప్తే.. వాటిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులు గుర్తుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
వాటిని ఎలా దాస్తారు
ఇదే విషయాలను గురువారం మంచిరేవులలోని యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేరు చెబితే సీనియర్ ఎన్టీఆర్, ఐటీ గురించి చెబితే నారా చంద్రబాబునాయుడు, ఆరోగ్యశ్రీ గురించి చెబితే వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఓ ఛానల్ మాత్రం కావాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును కట్ చేసి పారేసింది. “పేదవాడు తెల్ల అన్నం తిన్నప్పుడల్లా ఎన్టీఆర్.. ఐటీ ని చూసినప్పుడల్లా చంద్రబాబు గుర్తొస్తారు” అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో తంబ్ నైల్ పెట్టింది. ఇక్కడ కావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన పక్కన పెట్టింది. వాస్తవానికి మీడియా మీడియా లాగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారే. ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి పనిచేసిన వారే. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ప్రస్తావన తెచ్చినప్పుడు.. బాధ్యతాయుతమైన ఛానల్ గా థంబ్ నైల్ లో రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావిస్తే సరిపోయేది. కానీ ఇక్కడే ఆ ఛానల్ తన ఆశ్రిత పక్షపాతాన్ని మరోసారి రుజువు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు విషయంలో చూపించిన ఉదారతను.. వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో చూపించలేకపోయింది. ఇలా ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న మీడియాను .. ఓవర్గం ప్రజలు చీదరించుకోవడంలో తప్పేముంది.