HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి..? ఎందుకు..? అసలేంటి కథ?

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి..? ఎందుకు..? అసలేంటి కథ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరి పది నెలలు గడిచింది. ఇప్పటికే 23 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్.. ఈ పర్యటనపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయిన తరువాత మొదటి సారి ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి హస్తినకు పయనం అవుతుండడంతో మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ ఈసారికి క్లారిటీ రావచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ నెల 17వ తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కావాలని అధిష్టానం నుంచి ఇప్పటికే వారికి ఆహ్వానం అందింది. దాంతో వారు ఢిల్లీ బాట పట్టనున్నారు. అయితే.. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా అటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న వారు.. ఇటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఈసారికి ఫైనల్ అవుతుంది.. ఇక తమకు పదవులు వస్తాయని ఎప్పటికప్పుడు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. కానీ.. ప్రతిసారీ వారి ఆశలపై నీళ్లు జల్లుతూనే ఉన్నారు.

అయితే.. ఈ సారి వీరిద్దరి పర్యటనకు మాత్రం ప్రత్యేకత నెలకొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై, నామినేటెడ్ పదవులపై తప్పకుండా ఓ క్లారిటీ వస్తుందని వెల్లడించాయి. ఎందుకంటే.. ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు జమ్ముకాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో బిజీ ఉండిపోయారు. వారంతా ప్రచారం ఉండడంతో కలిసేందుకు ఎవరూ పెద్దగా టైం ఇవ్వలేదు. దాంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయడంపై జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ ఎన్నికలు కూడా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. దాంతో ఇప్పుడు అధిష్టానం పెద్దలంతా అందుబాటులో ఉన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిసిన తరువాత మరుసటి రోజు కూడా సీఎం, పీసీసీ చీఫ్ అక్కడే ఉండి ఈ రెండు అంశాలను కొలిక్కి తీసుకువచ్చేందుకు సిద్ధపడి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దసరాలోపే విస్తరణ జరుగుతుందని ఇప్పటివరకు అనుకుంటే.. పండుగ కూడా ముగిసింది. దాంతో ఇక అస్సలు ఆలస్యం చేయొద్దని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటున్నట్లుగానూ ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగా సీడబ్ల్యూసీ సమావేశాల అనంతరం జాబితాను డిసైడ్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. బుధవారం సాయంత్రమే రేవంత్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి వెళ్లిన తరువాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వీరి ఆధ్వర్యంలో ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి మంత్రుల పేర్లను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే ముఖ్యమంత్రితో కలుపుకొని కేబినెట్‌లో 12 మంది ఉండగా.. మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. నలుగురికే అవకాశం ఉన్నప్పటికీ.. ఆశావహుల సంఖ్య మాత్రం పదుల్లో ఉండడం గమనార్హం. ఇంత ఆశావహుల మధ్య ఎవరికి లక్ దక్కుతుందో చూడాలి మరి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular