Akhanda Jyothi: తెలంగాణ కల సాకారం చేసేందుకు ఎంతోమంది యువకులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. శ్రీకాంతాచారి నుంచి మొదలుపెడితే ఈశాన్ రెడ్డి వరకు ఎంతమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా తెలంగాణ కోసం త్యజించారు. అలాంటి వారి స్మృతులను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ అమరవీరుల స్మారకం నిర్మించింది. గురువారం దీనిని ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలో గతంలో ఉన్న లుంబిని పార్కు స్థలంలో సచివాలయ భవనానికి ఎదురుగా నిర్మించిన ఈ స్మారకాన్ని గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.
అతుకులు లేకుండానే..
దీపం రూపంలో ఈ అమరుల స్మారకాన్ని నిర్మించారు. అతుకులు లేని స్టేయిన్ లెస్ స్టీల్ తో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టెయిన్ లెస్ స్టీల్ వల్ల ఇది అద్దంలా మెరిసిపోతోంది. నిర్మాణాన్ని చూస్తే మొత్తం అద్దంతోనే కట్టినట్టు కనిపిస్తోంది. ఇక దీని విస్తీర్ణ ప్రకారంగా చూస్తే ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దది. జర్మనీ తయారుచేసిన స్టెయిన్ లెస్ స్టీల్ ను దుబాయిలో నిపుణులు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ చేసి నగరానికి తీసుకొచ్చారు. ఇక్కడ నిపుణుల సమక్షంలో అతికించి తెలంగాణ అమర జ్యోతి రూపంలో రూపొందించారు.
జర్మనీ నుంచి తీసుకొచ్చారు
ఇక జర్మనీ నుంచి తీసుకొచ్చిన ఈ స్టీల్ విలువ 50 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ తెలంగాణ అమర జ్యోతిని 177 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఆరు అంతస్తులు, 26, 800 చదరపు మీటర్ ల విస్తీర్ణంలో దీనిని రూపొందించారు. 45 మీటర్ల ఎత్తులో దీపం వెలుగుతున్నట్టు ప్రమిద ఆకారంలో దీనిని నిర్మించారు. చూసేందుకు ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ అమరవీరుల జ్యోతి నిర్మాణం కంటే ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆకృతులు ఉన్నాయి. అవి ఏంటంటే..
క్లౌడ్ గేట్
ఇది అమెరికాలోని ప్రధాన నగరమైన చికాగోలో ఉంది. చికాగో సముద్రం ఒడ్డున భారీ ఆకాశ హర్మ్యాల ప్రతిబింబాలతో అత్యంత ఆకర్షణయంగా ఉంటుంది. భారీ భవనాలు ఆకాశాన్ని తాకే విధంగా ఉండడంతో దీనిని మిలీనియం పార్కులో నిర్మించారు. భారతదేశంలో జన్మించి బ్రిటన్ ఆర్కిటెక్ట్ గా స్థిరపడిన అనేష్ కపూర్ అనే వ్యక్తి దీనిని రూపొందించారు. లిక్విడ్ మెర్క్యూరీ ఆధారంగా రూపకల్పన చేసినప్పటికీ ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం విశేషం. దీనిని ది బీన్ అని పిలుస్తారు. దీనికోసం 168 భారీ స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ఇది 66 అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తు ఉంది. 2004లో దీని నిర్మాణం మొదలయింది. 2006లో ప్రారంభమైంది.
బిగ్ ఆయిల్ బబుల్
ఇది మన పొరుగున ఉన్న చైనా దేశంలో ఉంది. కార్మే నగరంలో ఇది ఏర్పాటయింది. 1955లో ఈ ప్రాంతంలో చైనా చమురు బావుల తవ్వకం చేపట్టింది. తొలి బావి 1956లో అందుబాటులోకి వచ్చింది. చమురు కేంద్రం అనే భావన వచ్చేందుకు బిగ్ ఆయిల్ బబుల్ పేరుతో దీనిని నిర్మించారు. చికాగోలోని క్లౌడ్ గేటు మాదిరే ఉన్నప్పటికీ.. చైనా మాత్రం దీనిని ఖండిస్తోంది. 250 స్టెయిన్ లెస్ స్టీల్ షీట్స్ తో దీనిని నిర్మించారు.
ఫ్యూచర్ మ్యూజియం
ఏడారి దేశం దుబాయ్ లో రూపు దిద్దుకున్న నిర్మాణమిది. భారీ స్టెయిన్ లెస్ స్టీల్ సీట్లతో నిర్మించిన మూడవ అతిపెద్ద కట్టడం ఇది. నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. 225 అడుగుల ఎత్తు, 17,600 మీటర్ల వైశాల్యంతో దీనిని నిర్మించారు. ఈ భారీ భవనంలో ఎగ్జిబిషన్లు, ఇతర ప్రదర్శనలు, సదస్సులు నిర్వహిస్తారు. ఆధునిక దుబాయ్ లక్ష్యాన్ని అరబ్బీ అక్షరాల్లో తీర్చిదిద్దారు. మనం వందల సంవత్సరాలు బతకలేక పోయినప్పటికీ, మన ఆధునిక ఆవిష్కరణలు వందల ఇల్లు మనగడ సాగిస్తాయని ప్రారంభంతో ఆ పద్యం ఉంటుంది. 2016లో దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2022లో దీనిని పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ మూడు నిర్మాణాల తర్వాత తెలంగాణ అమరవీరుల జ్యోతి నాల్గవ స్థానంలో నిలిచింది.