CM KCR : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నవంబర్లో దాదాపుగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. ఈలోగానే గులాబీ బాస్ కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లో కేక్ వాక్ లాగా సాగిపోయిన బీఆర్ఎస్ వ్యవహారం.. ఈసారి అంత ఈజీగా లేదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను సొంత పార్టీ నాయకులే నిలదీస్తున్నారు.. మా ప్రాంతానికి నువ్వేం చేసావని ప్రశ్నిస్తున్నారు.. మరి కొంతమంది అయితే మంత్రులనే అడ్డుకుంటున్నారు. మరి ఇలాంటప్పుడు జనాన్ని దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొస్తుంది. భారత రాష్ట్ర సమితి కూడా అలానే చేస్తోంది. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. ఇలాంటప్పుడే జనానికి మరింత రీచ్ కావాలని గులాబీ బాస్ తలపోసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన తురుపు ముక్క నమస్తే తెలంగాణను తెరపైకి తీసుకువచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
గులాబీ కరపత్రం అయిపోయింది
ఎప్పుడైతే లక్ష్మీరాజం నుంచి నమస్తే తెలంగాణ పేపర్ ను తీసుకున్నాడో అప్పటినుంచి అది గులాబీ కరపత్రం అయిపోయింది. 2020 దాకా దానికి కట్ట శేఖర్ రెడ్డి ఎడిటర్ గా ఉండేవాడు. దూడం మార్కండేయ న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జిగా ఉండేవాడు. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ మార్కండేయను బయటికి పంపించారు. దీంతో ఆయన ప్రస్తుతం దిశ అనే ఒక వెబ్ పేపర్ ను నడిపిస్తున్నాడు. ఇక కట్టా శేఖర్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి బామ్మర్ది కావడంతో ఆయనకు నమస్తే తెలంగాణ ఎడిటర్ బాధ్యతలనుంచి తొలగించి సమాచార హక్కు చట్టం చైర్మన్గా నామినేటెడ్ పోస్ట్ కేటాయించారు. ఆ తర్వాత ఆ స్థానంలోకి ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ ఇంచార్జ్ తిగుళ్ల కృష్ణమూర్తిని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన సారథ్యంలో నమస్తే తెలంగాణ పేపర్ నడుస్తోంది. ఇదే సమయంలో తిగుళ్ల కృష్ణమూర్తి చేతుల్లోకి ఆ పత్రిక క్రమంగా వెళ్లిపోయింది. ఒకప్పుడు ఉద్యమ సమయంలో ఉత్సాహంగా పనిచేసిన వారందరినీ కూడా కృష్ణమూర్తి బయటకి పంపించాడు. తన వాళ్లతో ఆ పత్రికను నింపాడు.. సాధారణంగానే ఇది అక్కడ పని చేసే వారికి విసుగు తెప్పిస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆమధ్య మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తమ వేతనాల పెంపు కోసం ధర్నా చేసిన సంగతి తెలిసిందే. చివరికి కృష్ణమూర్తి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత వారు ధర్నా విరమించారు. కానీ ఇంతవరకు వేతనాల పెంపు జరగలేదని సమాచారం. సరే ఇది ఇలా ఉంటే తాజాగా నమస్తే తెలంగాణ భారాన్ని ఎమ్మెల్యేల మీద రుద్దేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఏబీసీ సర్టిఫికేట్ లేదు
నమస్తే తెలంగాణ ప్రారంభించి దగ్గర దగ్గర 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు దానికి ఏ బి సి సర్టిఫికెట్ లేదు. దాని సర్కులేషన్ ఫిగర్స్ అంతంత మాత్రమే కాబట్టి ఏ బి సి జోలికి పోలేదని తెలుస్తోంది.. సొంత గవర్నమెంట్ ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఇవాల్టికి తెలంగాణలో నాలుగో స్థానంలో ఉంది. దానికి ఎన్ని జాకీలు పెట్టి లేపినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.. అయితే ప్రస్తుతం త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పత్రిక ద్వారా ప్రచారం మరింత ముమ్మరం చేసుకోవాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్క ఎమ్మెల్యే ఐదువేల నమస్తే తెలంగాణ కాపీలు చేయించాలని టార్గెట్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతలను స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి తక్కువలో తక్కువ 3 లక్షల వరకు ప్రింటింగ్ ఆర్డర్ పెరగాలని గులాబీ బాస్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఎప్పుడైతే కెసిఆర్ చేతుల్లోకి వెళ్లిందో..
అయితే నమస్తే తెలంగాణ పేపర్లో గులాబీ భజన అధికం కావడంతో జనం పెద్దగా చదవడం లేదు. ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ దాదాపు ఆంధ్ర జ్యోతి కి దగ్గర్లో ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ పత్రిక కెసిఆర్ చేతుల్లోకి వెళ్లిందో అప్పుడే గులాబీ రంగు బాగా పూసుకుంది. గులాబీ భజన ఎక్కువ కావడం, ఇతర ప్రతిపక్షాల వార్తలకు కనీసం సింగిల్ కాలం స్పేస్ కూడా ఇవ్వకపోవడంతో జనం దాన్ని చదవడం మానేశారు. చివరికి పాత్రికేయ ప్రమాణాలను గాలిలో కలిపి అడ్డగోలుగా వార్తలు రాయడం వల్ల సొంత పార్టీ వారే ఆ పత్రికను చదవడం మానేశారు. దీంతో దాని సర్కులేషన్ లక్ష లోపుకు పడిపోయిందని తెలుస్తోంది. అందుకే ఈసారి ఆ పత్రిక సర్కులేషన్ పెంచే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో అంటే 2018 ఎన్నికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఆఫరే వచ్చింది. టిడిపి నాయకులు భుజం మీద వేసుకొని ఆ పత్రికలను కరపత్రాలుగా పంచారు.. కానీ ఏమైంది? ఎంత పచ్చ రాతలు రాసినా 23 దగ్గరే 40 ఏళ్ల అనుభవం ఆగిపోయింది. మరి ఇప్పుడు తెలంగాణలోనూ నమస్తే తెలంగాణ బరువు బాధ్యతను కేసీఆర్ ఎమ్మెల్యేల మీద పెట్టాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.