Telugu Media (2)
Telugu Media: ఉత్తర తెలంగాణలో ప్రముఖ పత్రిక కార్యాలయంలో ఇటీవల పెద్ద యుద్ధమే జరిగింది. ఆ పత్రిక యాజమాన్యం ప్రతి దసరాకు వార్షికోత్సవ ప్రకటనలు ప్రచురిస్తుంది. ప్రతి రిపోర్టర్ కు టార్గెట్ విధిస్తుంది. రాష్ట్రస్థాయిలో ఉన్న నెట్వర్క్ ఇన్చార్జి.. ఈ యాడ్స్ టార్గెట్ ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తూ ఉంటారు. జిల్లా స్థాయిలో అయితే బ్రాంచ్ మేనేజర్, బ్యూరో చీఫ్ పర్యవేక్షిస్తుంటారు. చివరికి బ్యూరో చీఫ్ కూడా టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకుంటే స్టేట్ లెవెల్లో నెట్వర్క్ ఇన్చార్జి నుంచి ప్రతిరోజు అక్షింతలు తప్పవు.. అందువల్లే రిపోర్టర్ల పై బ్యూరో చీఫ్ లు విరుచుకుపడుతుంటారు. టార్గెట్లు పూర్తి చేయాలని బండ బూతులు తిడుతుంటారు. ఇక బ్యూరో చీఫ్ లను బ్రాంచ్ మేనేజర్లు విధిస్తుంటారు. ఇదంతా ఒక సైకిల్.. ఇందులో నుంచి బయటపడే ప్రయత్నం కానీ.. బయటికి రావాలనే ఆలోచన గాని ఎవరూ చేయరు. ఎందుకంటే దీంట్లో నుంచి బయటపడితే సమాజం నుంచి గుర్తింపు పోతుందని.. ఇన్నాళ్లపాటు లభించిన సో కాల్డ్ గౌరవం దూరమవుతుందని అందరి భావన. దీనిని యాజమాన్యం క్యాష్ చేసుకుంటుంది. ప్రతి ఏడాది రాచీరంపాన పెట్టి యాడ్స్ టార్గెట్ పూర్తి చేసుకుంటుంది. ఇలా యాడ్స్ వేసి.. కస్టమర్లు డబ్బులు ఇవ్వక.. సొంత జేబులో నుంచి చెల్లించిన రిపోర్టర్లు కోకొల్లలు.
కొట్టుకున్నారు
తాజాగా తెలంగాణ జిల్లాలో ఒక పత్రికా కార్యాలయంలో ఓ యాడ్ మేనేజర్, బ్యూరో చీఫ్ కొట్టుకున్నారు. దానికంటే ముందు బూతులు తిట్టుకున్నారు. ఈ పంచాయతీ జరగడానికి రెండు డిపార్ట్మెంట్ల మధ్య గెట్టు పంచాయతీలే కారణం. అయితే ఈ పంచాయతీని పరిష్కరించాల్సిన బ్రాంచ్ మేనేజర్.. పెద్దమనిషి పాత్రను పోషించి ఉండాల్సి ఉండగా.. ఆయన బ్యూరో చీఫ్ వైపు మళ్ళి పోయారు. దీంతో యాడ్ మేనేజర్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఇంతకీ ఈ పంచాయతీ వెనుక జరిగింది ఏంటయ్యా అంటే.. వార్షికోత్సవ ప్రకటనల సందర్భంగా.. సదరు యాడ్ మేనేజర్ ఓ క్లైంట్ వద్దకు వెళ్లారు. ఆ క్లైంట్ వద్దకు అప్పటికే ఓ రిపోర్టర్ వచ్చి వెళ్ళాడు. వార్షికోత్సవం పేరు చెప్పి యాడ్ తీసుకువెళ్లాడు. ఇది ఆ యాడ్ మేనేజర్ కు నచ్చలేదు. ” మీ రిపోర్టర్ కు చెప్పండి. ఆ క్లైంట్ వద్దకు ఎందుకు వెళ్ళకూడదని.. ప్రతి ఏడాది మనకు ఆ క్లైంట్ వద్ద నుంచి జనరల్ యాడ్స్ వస్తుంటాయి. ఇలాంటి వారిని వార్షికోత్సవ పరిధిలోకి తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు మా టార్గెట్ ఫినిష్ కాదు. మీ రిపోర్టర్ కు ఎంతో మంది క్లైంట్లు ఉంటారు కదా.. వారిని అడుక్కోవచ్చు కదా.. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కానివ్వకండని” ఆ యాడ్ మేనేజర్ బ్యూరో చీఫ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో ఆ బ్యూరో చీఫ్ కు ఒళ్ళు మండింది..” మా రిపోర్టర్ అలానే వెళ్తాడు. ఇకపై కూడా వెళ్తాడు.. ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ ఆ బ్యూరో చీఫ్ వ్యాఖ్యానించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. పంచాయతీ కాస్త బ్రాంచ్ మేనేజర్ దాకా వెళ్ళింది. అయితే ఈ పంచాయతీని పరిష్కరించాల్సిన ఆయన బ్యూరో చీఫ్ కు అండగా నిలిచాడు. మాట్లాడుకుందామని వారిద్దరిని తన ఛాంబర్ లోకి పిలిపించాడు. విషయం ప్రస్తావనకు రాగానే.. యాడ్ మేనేజర్ ను బ్రాంచ్ మేనేజర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అతడి అసలు అంతరార్థం తెలియక యాడ్ మేనేజర్ కుర్చీ పైకి లేపి బ్యూరో చీఫ్ ను కొట్టే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో బ్యూరో చీఫ్ బూతులు అందుకున్నాడు. అంతే ఆ తర్వాత యాడ్ మేనేజర్ మరుసటి రోజు ఆ పత్రిక కార్యాలయంలోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయం మొత్తం జరిగిన తర్వాత నివేదిక మొత్తాన్ని యాడ్ మేనేజర్ కు బ్యూరో చీఫ్ వ్యతిరేకంగా ఇచ్చాడు. అంతే యాజమాన్యం ఆ యాడ్ మేనేజర్ పై చర్యలు తీసుకుంది..
గారెల బుట్టలో పడ్డాడు..
తంతే గారెల బుట్టలో పడ్డట్టు..ఆ యాడ్ మేనేజర్ ప్రస్తుతం ఓ షార్ట్ న్యూస్ ఏజెన్సీలో యాడ్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఉద్యోగం సాధించాడు. వేతనం కూడా నెలకు లక్ష పైమాటే నట.. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ యాడ్ మేనేజర్ గాని.. బ్యూరో చీఫ్ గాని తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది.. అదేంటంటే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వ్యక్తిగత కక్షలకు దూరంగా ఉండాలి. అహాన్ని చాలావరకు అణుచుకోవాలి. ఇవాళ యాడ్ మేనేజర్ బయటికి వెళ్ళవచ్చు. కానీ రేపట్నాడు బ్యూరో చీఫ్, బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలు మాత్రం శాశ్వతమా?! అది ఆలోచించుకోవాల్సింది వాళ్లే. అంతిమంగా ఇక్కడ గేమ్ ఆడిస్తోంది మాత్రం మేనేజ్మెంట్. అందులో ఏమాత్రం అనుమానం లేదు..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Clash in the office of a popular magazine in north telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com