Kamalapur : ఒకరిని ఒకరు దోచుకుంటారు.. అని వీర బ్రహ్మంగారు.. తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే.. అది నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీలు చేసేవారు. ఇంట్లో సొత్తు ఎత్తుకెళ్లేవారు. కానీ ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నా.. చోరీలు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. అడ్డుకున్నవారిని అంతం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. మద్యం, గంజాయి మత్తులో.. విలాసాల కోసం ఈజీగా డబ్బు సంపాదించడం కోసం ఇలా చాలా మంది దొంగలుగా మారుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా కమలాపూర్‌లో దొంగతనాలు పెరుగుతున్నాయి. ఇంట్లో మనుషులు ఉన్నా లెక్క చేయడం లేదు. ఆయుధాలతో చోరీలకు వెల్తున్నారు.
తలుపు తట్టి..
దొంగతనాలకు దొంగలు కొత్తగా ఆలోచిస్తున్నారు. నలుగురైదుగురు కలిసి అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీలకు బయల్దేరుతున్నారు. ఆయుధాలు పట్టుకుని వెళ్లి.. టార్గెట్ చేసిన ఇంటి ఆవరణలోకి వెళ్తున్నారు. ఒక దొంగ డోర్ కొట్టగా.. మిగతా దొంగలు చాటుగా దాక్కుంటున్నారు. డోర్ కొట్టిన తర్వాత ఎవరైనా బయటకు వస్తే.. వారిపై దాడి చేసి ఇంట్లో చొరబడుతున్నారు. లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్నవారిపై దాడిచేస్తున్నారు. తర్వాత సొత్తు చోరీ చేసి పారిపోతున్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనాలు పెరుగుతుండడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
వీడియో విడుదల..
కమలాపూర్‌లో కొంతకాలంగా జరుగుతున్న కొత్త తరహా చోరీలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను సీఐ హరికృష్ణ విడుదల చేశారు. రాత్రివేళ ఎవరైనా ఇంటికి వచ్చి.. తలుపు తడితే వెంటనే డోర్ తీయొద్దని సూచించారు. ముందుగా కిటికీలో నుంచి చూడాలని పేర్కొంటున్నారు. తెలిసిన వారు వస్తేనే డోర్ తీయాలని పేర్కొంటున్నారు. లేదంటే డోర్ తీయకుండా.. 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.