Gaddam Sammaiah: వీన్ని వాడేమన్నాడు. వాన్ని వీడేమన్నాడు.. వాడి పాలనలో జరిగిన అక్రమాలు ఎన్ని? వీడి పాలనలో కూడబెట్టిన ఆస్తులెన్నీ? స్విస్ బ్యాంకులో దాచుకున్నది ఎంత.. అనుచరుల పేరుతో వసూలు చేసింది ఎంత? ఇవే కదా పేపర్లలో తరచూ కనిపించే వార్తలు.. మీడియాలో వినిపించే వార్తలు.. మేనేజ్మెంట్లకు రాజకీయరంగులు ఉండటంతో.. రాసే రాతలు కూడా వాటి కోణంలోనే ఉంటాయి. అసలు పాఠకుడి ఉద్దేశం పట్టేది ఎవరికీ.. వీక్షకుడి ఆసక్తి తెలిసేది ఎందరికీ… ఏళ్ళుగా చూసి చూసి మొహం మొత్తిందో.. ఇదేం దరిద్రమో అనుకుంటున్నారో తెలియదు కానీ చాలామంది పాఠకులు న్యూస్ పేపర్లు చదవడం లేదు. వెబ్సైట్లను మాత్రం చూస్తున్నారు. సోషల్ మీడియాను ఎక్కువ ఫాలో అవుతున్నారు. నిజమో, అబద్దమో, ప్రచారమో, గుడ్డ కాల్చి మీద వేసే టెంపరితనమో.. ఇవన్నీ దాని ద్వారానే తెలుసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు పేపర్లు కూడా జన రంజకమైన వార్తలు రాస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అందులో పని చేసే పెద్దలకు జనం అనే కోణం కనిపిస్తుందేమో తెలియదు గాని.. ఆసక్తికరమైన కథనాలను వండి వార్చుతుంటారు.
ఇక మొన్న కేంద్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొంతమంది లద్దప్రతిష్టులైన వ్యక్తులకు పద్మ పురస్కారాలు ప్రకటించింది కదా. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య ఒకరు. ఈయన కళకు చేస్తున్న సేవకు గానూ కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. పురస్కారం ప్రకటించగానే సహజంగానే సమ్మయ్యకు ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకుల నుంచి మొదలు పెడితే సామాన్యుల వరకు ఆయనకు ఫోన్లు చేసి అభినందించారు. విజయం సాధించినప్పుడో, ఇంకా ఏదో సాధించినప్పుడు సహజంగానే మన సమాజం దగ్గరికి తీసుకుంటుంది. ఆకాశానికి ఎత్తేస్తుంది.. అది సర్వసాధారణం కూడా. కానీ సమ్మయ్యకు సంబంధించి ఆంధ్రజ్యోతి రాసిన ఒక వార్త మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. మిగతా మీడియా సంస్థలు రాసినప్పటికీ.. ఆంధ్రజ్యోతి చిందు చిద్వి లాసం అనే శీర్షికతో వార్తను నడిపించిన విధానం బాగుంది.

స్మార్ట్ ఫోన్ కు బానిసలమైపోయిన తర్వాత చాలామందికి మన కళల పట్ల, సంప్రదాయాల పట్ల మక్కువ తగ్గిపోతుంది. కొందరైతే వాటిని మర్చిపోతున్నారు కూడా. అయితే కొంతమంది కళాకారులు వారి కళా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వెనుకటి కళలను ఏదో వ్యాపకంగా బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కథలను, వారి గాథలను బయట ప్రపంచానికి చెప్పేవారు చాలా తక్కువ. అయితే ఇలాంటి ప్రయత్నాన్ని ఆంధ్రజ్యోతి చేసింది. చంద్రబాబు నాయుడికి అది ఓ స్థాయిలో డప్పు కొట్టినప్పటికీ.. కొన్ని విషయాల్లో జర్నలిస్టు టెంపర్ మెంట్ ప్రదర్శిస్తుంది. ఇలాంటి క్రమంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని సాధించిన గడ్డం సమ్మయ్య మీద అద్భుతమైన కథనాన్ని ప్రచురించింది. ఈనాడు, సాక్షి రాసినప్పటికీ.. అవి గడ్డం సమ్మయ్య అసలు కోణాన్ని స్పృశించలేకపోయాయి. ఏదో రాశామా అన్నట్టుగా వదిలేశాయి. రోజు చూస్తున్న అనేక క్షుద్ర వార్తల నడుమ ఇలాంటివే కొంచెం సాంత్వన కలిగిస్తాయి. మీడియా అంటే జనంలో కొంతలో కొంతైనా నమ్మకాన్ని కలిగిస్తాయి.