TG MLC Elections: తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతోపాటు రెండు టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అదే రోజు నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. 27న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 3న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీ చేయనున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ప్రతిపక్ష బీజేపీ మాత్రం అభ్యర్థి ప్రకటనపై తర్జనభర్జన పడుతోంది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీ చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ సడెన్‌గా కొత్తపేరు తెరపైకి వచ్చింది.
రేసులోకి ప్రసన్న హరికృష్ణ..
ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ కోసం నరేందర్‌రెడ్డిటోపాటు, ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరికీ మంచి బలం ఉండడంతో సమాలోచనలు చేసింది. చివరకు నరేందర్‌రెడ్డిని ప్రకటించింది. దీంతో ప్రసన్న హరికృష్ణ బీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వెళ్లారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్ రావుతో చర్చలు జరిపారు. ప్రసన్న హరికృష్ణ ట్రాక్ రికార్డును అందింది. దీనిని గులాబీ బాస్ సోమవారం(ఫిబ్రవరి 3న) పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేవు. ఈ తరుణంలో అభ్యర్థి బలంగా ఉండాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతను రంగంలోకి దింపింది. దీంతో బీఆర్‌ఎస్ ప్రసన్న హరికృష్ణనే బరిలో దించే అవకాశం ఉంది.
రెబల్‌గా రవీందర్‌సింగ్..
ఇక ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కరీంనగర్ మాజీ మేయర్ ఆశలు ఆవిరవుతున్నాయి. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో రెబల్‌గా పోటీ చేశారు. తాజాగా మరోసాని నిరాశే మిగిలేలా ఉంది. దీంతో మరోమారు రెబల్‌గా బరిలో దిగాలని భావిస్తున్నారు. కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని, ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని రవీందర్‌సింగ్ నాలుగు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. అనూహ్యంగా ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ తెరపైకి వచ్చారు. దీంతో అధిష్టానం హరికృష్ణవైపే మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. దీంతో రవీందర్‌సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దీనిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. రెబల్‌గా నిలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు.