KTR: కేటీఆర్‌లో స్ఫూర్తి నింపుతున్న చంద్రబాబు.. స్వయంగా ప్రకటిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌!

చంద్రబాబుకు కేసీఆర్‌ బద్ధ శత్రువులా మారారు. కేసీఆర్‌ కూడా చంద్రబాబును శత్రువుగానే చూశారు. కానీ, తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌కు జానోదయం కలిగినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు జపం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే నెగెటివ్‌ గానే కాదు.. పాజిటివ్‌ కూడా ఆయన చంద్రబాబునే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు కేటీఆర్‌.

Written By: Raj Shekar, Updated On : July 14, 2024 11:11 am

KTR

Follow us on

KTR: శీర్షిక చూడగానే ఆశ్చర్యంగా ఉందికదూ.. కానీ ఇది నిజమే.. తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌కు బద్ధ శ్రతువు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగా, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కొత్త రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన కేసీఆర్, చంద్రబాబు గతంలో టీడీపీలో కనిపి పనిచేశారు. కొత్త రాష్ట్రంలో కలిసి పనిచేయాల్సి ఉన్నా.. శత్రువులుగా మారారు. ఇందుకు కారణం తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ పార్టీ అభ్యర్థలు తెలంగాణలో విజయం సాధించారు. దీనిని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోయారు. టీడీపీని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని ఫిరాయింపులను ప్రోత్సహించారు. టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని టీడీఎల్పీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు.

ఓటుకు నోటు కేసుతో…
ఇక ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చిన కేసీఆర్‌.. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబును ఇక్కడి నుంచి తరిమేశాడు. ఈ కేసులో రేవంత్‌రెడ్డిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసీఆర్‌.. చంద్రబాబును కూడా ఇరికించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణ నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ ఐదేళ్లు కూడా కేసీఆర్, చంద్రబాబు ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరించారు.

తండ్రి అలా.. కొడుకు ఇలా..
చంద్రబాబుకు కేసీఆర్‌ బద్ధ శత్రువులా మారారు. కేసీఆర్‌ కూడా చంద్రబాబును శత్రువుగానే చూశారు. కానీ, తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌కు జానోదయం కలిగినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు జపం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే నెగెటివ్‌ గానే కాదు.. పాజిటివ్‌ కూడా ఆయన చంద్రబాబునే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు కేటీఆర్‌. ఢిల్లీలో అయినా.. తెలంగాణలో మీడియాతో లేదా మరో సందర్భంలో ఎక్కడ మాట్లాడాల్సి అవసరం వచ్చినా.. తాము గొప్పగా మళ్లీ పుంజుకుంటామని చెబుతున్నారు. ఇందుకు చంద్రబాబునే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ పని అయిపోయిందని అందరూ భావించారని, కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుందని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా అలాగే ఎదుగుతుందని కేటీఆర్‌ ఉదాహరణగా చెబుతున్నారు.

చంద్రబాబు పనైపోయిందన్నది తండ్రీ కొడుకులే..
ఇదిలా ఉంటే.. ఎపీలో చంద్రబాబు పనైపోయిందని అన్నది ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి, తోపాటు ఆయన మంత్రులు విమర్శించారు. తర్వాత తెలంగాణలో తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్‌ మాత్రమే అన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇలా టీడీపీని చులకన చేసి మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వారి అహంకారాన్ని ఓటర్లు కిందకు దించారు.

బాబునే ఉదాహరణగా..
తెలంగాణలో కూడా ఆరు నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కూడా ఓడిపోయింది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే 10 మంది అధికార కాగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. మరో 15 మందిని కూడా లాగేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. వలసలు ఆపేందుకు కేసీఆర్, కేటీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో బీఆర్‌ఎస్‌ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో క్యాడర్‌ ఆత్మస్థైర్యం కోలోపకుండా ఉండేందుకే కేటీఆర్‌.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తరచూ ఉదహరిస్తున్నారు.

అంత ఈజీ కాదు..
టీడీపీ తరహాలో తెలంగాణలో ఐదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఎదగడం అంత ఈజీ కాదంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు. టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్‌ ఉంది. తెలంగాణలో పార్టీ లేకపోయినా ఇప్పటికీ టీడీపీ సానుభూతిపరులు ఉన్నారు. కానీ బీఆర్‌ఎస్‌కు అలాంటి పరిస్థితి లేదు. బీఆర్‌ఎస్‌లో మెజారిటీ నాయకులు వలసవాదులే. అధికారంలో ఉన్నప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా.. అన్ని పార్టీల నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. దీంతో వారు అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడే ఉంటామన్నట్లు వెళ్లిపోతున్నారు. బీఆర్‌ఎస్‌ కోసం కష్టపడే క్యాడర్‌ తక్కువగా కనిపిస్తోంది.