Chaganti koteswarao : టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? రాజకీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టిటిడి లడ్డు వివాదం నేపథ్యంలో రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తిని నియమిస్తే ఇదే తరహా ఆరోపణలు వస్తాయని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి టీటీడీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుమాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పేరు ప్రముఖంగా వినిపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు పేరు బయటకు వచ్చింది. అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, టిడిపి కురువృద్ధుడు అశోక్ గజపతి రాజుకు ఆ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటి ప్రకటన ఏమీ రాలేదు. సినీ నటుడు మురళీమోహన్, టీవీ5 అధినేత పి ఆర్ నాయుడు పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. కానీ ఎవరిని నియమించలేదు. ఇటీవల 20 కార్పొరేషన్లకు సంబంధించిచైర్మన్ లను నియమించారు. అందులో టీటీడీ ప్రస్తావన లేదు. అయితే వరుసగా టీటీడీపై వస్తున్న వివాదాల నేపథ్యంలో.. మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
* మీడియాలో కథనాలు
తాజాగా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. మీడియాలో సైతం పతాక శీర్షికలో కథనాలు వస్తున్నాయి. వైసిపి హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు… చాగంటి కోటేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుడుగా నియమితులయ్యారు. అప్పట్లో చాగంటి కుటుంబం తాడేపల్లి కి వెళ్లి మరి అప్పటి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ సలహాదారు పోస్టులో చాగంటి కోటేశ్వరరావు ఎన్ని రోజులు కూడా ఉండలేదు. నెల రోజులకే తన పదవికి రాజీనామా చేశారు. టీటీడీకి సేవలందించడానికి పదవులు ఉండక్కర్లేదని.. ఇతర మార్గాల్లో కూడా సేవలు అందించవచ్చు అని అప్పట్లో స్పష్టం చేశారు చాగంటి.
*అప్పట్లో నచ్చక రాజీనామా
వైసిపి విధానాలు నచ్చక అప్పట్లో చాగంటి రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు హైకోర్టు సలహాదారుల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై మనస్థాపానికి గురయ్యారు చాగంటి. ఏదో ఒక రోజు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉందని తెలియడంతో ఆయన ముందుగానే మేల్కొన్నారు. సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో టీటీడీకి సేవలందించే అవకాశం వస్తే తప్పకుండా ఆలోచన చేస్తానని ప్రకటించారు. పరుగెత్తుకుంటూ వస్తానని కూడా చెప్పుకొచ్చారు.
* ఆ కోణంలో ఆలోచిస్తున్న చంద్రబాబు
తాజాగా లడ్డు వివాదం నేపథ్యంలో టిటిడి చరిత్ర మసకబారింది. అందుకే శ్రీవారి సేవను పారదర్శకంగా చేసుకునే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తికి అప్పగిస్తే న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చాగంటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మీడియాలో సైతం అదే కథనాలు వస్తున్నాయి. అయితే అది వాస్తవమా? ఉత్త ప్రచారమా? అన్నది తెలియాల్సి ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu is considering the name of popular prophet chaganti koteswara rao as the chairman of ttd trust board
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com