Telangana TDP  : తెలంగాణలో టిడిపి బలోపేతానికి చంద్రబాబు భారీ స్కెచ్!

తెలంగాణలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు అధికారాన్ని వెలగబెట్టిన బీఆర్ఎస్ ఉనికిలో లేకుండా పోయింది. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అవుతోంది. పూర్వ వైభవానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

Written By: Dharma, Updated On : August 25, 2024 11:29 am

Telangana TDP

Follow us on

Telangana TDP : ఏపీలో తెలుగుదేశం పార్టీ సూపర్ విక్టరీ సాధించింది. అందుకే ఇప్పుడు తెలంగాణ పై ఫోకస్ పెట్టింది. అక్కడ పూర్వవైభవం సాధించడం ఎలా? అన్న దానిపై చంద్రబాబు విస్తృతంగా ఆలోచనలు మొదలుపెట్టారు. ఈరోజు తెలంగాణ టిడిపి నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత.. ఆ పార్టీకి తెలంగాణ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ఆంధ్ర కంటి తెలంగాణలోని మెజారిటీ స్థానాలు సాధించుకునేది. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీగా చిత్రీకరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.టిడిపి నేతలను తన పార్టీలోకి తీసుకెళ్లిపోయారు. టిడిపికి క్యాడర్ ఉన్న నడిపించే నాయకుడు లేక ఆ పార్టీ డీలా పడింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఆశించిన సీట్లు దక్కలేదు. 2018 లోనూ పరాభవమే ఎదురైంది. 2023 నాటికి పోటీలోనే లేకుండా పోయింది. అయితే ఏపీలో 134 సీట్లు సాధించిన నేపథ్యంలో.. అదే స్ఫూర్తితో తెలంగాణలో టిడిపి జెండా ఎగురవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే నెలలో రెండు రోజులపాటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సమయం కేటాయించడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

* అధ్యక్ష స్థానం భర్తీ
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అంతకంటే ముందే తెలంగాణ టిడిపి బాధ్యతలను బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించారు చంద్రబాబు. తెలంగాణలోని 117 నియోజకవర్గాల్లో టిడిపి శ్రేణులను ఆయన యాక్టివ్ చేయగలిగారు. అయితే సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా మారిపోయారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్మానించారు. దీనిని వ్యతిరేకిస్తూ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.

* పార్టీ బలోపేతంపై దృష్టి
ఈరోజు సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతంపై నిర్ణయాలు తీసుకొనున్నారు. వివిధ కారణాలతో పార్టీని వీడిన నాయకులను తిరిగి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువగా బిఆర్ఎస్లోకి వలసలు సాగాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏమంత బాగాలేదు. దీంతో చాలామంది డిఫెన్స్ లో ఉన్నారు. వారంతా సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వారిని తెలుగుదేశం పార్టీలోకి రప్పించాలన్నది చంద్రబాబు ప్లాన్. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నేతలు టిడిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గ్రేటర్ సిటీ తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

* వచ్చే ఎన్నికల నాటికి
తెలంగాణ వ్యాప్తంగా పార్టీని నిలబెట్టి సభ్యత్వం పెంచుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. 2028 ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మార్చాలని చూస్తోంది. క్యాడర్ ఉన్న దృష్ట్యా పొత్తులతో ముందుకు సాగి పార్టీకి జీవం పోయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా పూర్వ వైభవం దిశగా పార్టీని తీసుకెళ్లాలని ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. నెలలు రెండు రోజులపాటు తెలంగాణ పార్టీకి సమయం కేటాయించనుండడంతో.. అక్కడ పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.