Census Survey : తెలంగాణ ఎన్నికల సమయంలోనే తాము అధికారంలోకి వచ్చాక కుల గణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పది నెలల తర్వాత కుల గణన ప్రక్రిక మొదలు పెట్టింది. అనేక వాయిదాల తర్వాత నవంబర్ 9 నుంచి సర్వే ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు ఫారాలను ముద్రించింది. సర్వే చేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. సర్వేకు ముందురోజు కిట్లు పంపిణీ చేసింది. దీంతో సర్వే ప్రారంభమైంది. అయితే సర్వేలో ప్రశ్నలు ఎక్కువగా ఉండడం, వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తుండడం, తదితర కారణాలతో సర్వే స్లోగా జరుగుతోంది. ఇప్పటి వరకు 30 శాతం సర్వే మాత్రమే పూర్తయింది. సర్వేను ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక సర్వేనిర్వహించే ఎన్యూమరేటర్లు.. లేదా అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన సర్వే దరఖాస్తు పత్రాలు తాజాగా రోడ్లపై దర్శనమిస్తున్నాయి. సర్వే తీరుపై ఇప్పటికే విపక్షాలు, ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుల గణన పేరుతో ఆస్తులు, వ్యక్తిగత వివరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దరఖాస్తులు రోడ్లపై కనిపించడంతో సర్వే మొక్కువడిగా నిర్వహిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మేడ్చల్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై
మేడ్చల్ జిల్లాలో సర్వ పత్రాలు రోడ్లపై కనిపించడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై దరఖాస్తు ఫారాలు కనిపించాయి. దీంతో వాటిని చూసిన జనం.. ఎన్యూమరేటర్లు.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వివరాలు గోప్యంగా ఉంటాయని చెబుతుంటే.. ఇలా రోడ్లపై దరఖాస్తులు దర్శనమివ్వడంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేపై ప్రజల్లో నమ్మకం సడలిపోతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీ ఫారాలే..
ఇదిలా ఉంటే.. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై కనిపించిన కుటుంబ సర్వే పత్రలు ఖాళీవే అని తెలుస్తోంది. ఇందులో ఎవరి వివరాలు లేవని స్థానికులు తెలిపారు. సుమారు అర కిలోమీటర్ మేర ఇలా ఖాళీ దరఖాస్తు పత్రాలు పడి ఉన్నాయి. మేడ్చల్–నిజామాబాద్ రహదారి వెంట ఉన్న రేకుల బావి చౌరస్తాలో ఈ ఫారాలు దర్శనమిచ్చాయి. ఈ విషయం మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి రావడంతో వెంటనే తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఫారాలు సేకరించారు. ఇవి ఎలా వచ్చాయి అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్యుమరేటర్లు, మున్సిపల్ అధికారులతో సమావేశమై చర్చిస్తామని వెల్లడించారు. మరోసారి ఇలా దరఖాస్తులు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు