Telangana : ఎన్ కన్వెన్షన్ నేలమట్టం సరే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిని కూడా పడగొడుతుందా?

ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఒక రకమైన పాజిటివిటీ కోణం బయటికి వస్తోంది. ప్రభుత్వంపై జనాలకు సదాభిప్రాయం కలుగుతోంది.. ఇది స్థిరంగా నిలబడాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటివి చాలా చేయాలి.

Written By: NARESH, Updated On : August 24, 2024 10:15 pm

Revanth Reddy government demolish

Follow us on

Telangana: ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేసిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఒక రకమైన పాజిటివిటీ కోణం బయటికి వస్తోంది. ప్రభుత్వంపై జనాలకు సదాభిప్రాయం కలుగుతోంది.. ఇది స్థిరంగా నిలబడాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటివి చాలా చేయాలి. “నిండుగా నీళ్ళు.. మెండుగా ప్రజలు.. కడుపునిండా తిండి.. చేతినిండా పని.. సౌభాగ్యం వర్ధిల్లాలి.. శాంతి ప్రసరించాలి.. వీటన్నింటి మధ్య నా నగరం విస్తరించాలి” అప్పట్లో కులి కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని కీర్తిస్తూ ఈ మాటలు అన్నాడని చరిత్రకారులు ఇప్పటికి చెబుతుంటారు. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది. ఆకలి అని వచ్చినవాడిని అక్కున చేర్చుకుంది. ఉపాధి కోసం వచ్చిన బడుగు జీవులకు అండగా నిలిచింది. హైదరాబాద్ అంటే అన్నం పెట్టే అమ్మ. ఉపాధి కల్పించే బతుకుదెరువు. తోడుగా ఉండే స్నేహితుడు. ధైర్యం చెప్పే సన్నిహితుడు.. ప్రపంచంలో ఏ నగరానికి వెళ్లినా కనిపించని వైవిధ్యం కేవలం హైదరాబాదులో మాత్రమే దర్శనమిస్తుంది. అందుకే ఈ నగరానికి వచ్చి బతుకు బాటలు బలంగా వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

హైదరాబాద్ విస్తరిస్తున్న సమయంలో..

నగరం విస్తరిస్తున్న సమయంలో ఒకప్పటి చెరువులు మాయమయ్యాయి. నాలాలు కాలగర్భంలో కలిసిపోయాయి. తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్, అమీన్ పూర్.. ఇలా చాలా చెరువులు కబ్జా గురయ్యాయి. చాలా చెరువులు పూర్తిగా విలుప్తమయ్యాయి. ఫలితంగా వర్షం వస్తే చాలు హైదరాబాదు నగరం మొత్తం మునిగిపోతోంది. ద్వీపకల్పం లాగా మారిపోయి తన ప్రభను మొత్తం కోల్పోతోంది. ఇది ఇలాగే జరిగితే హైదరాబాదు నగరం తన ఆనవాళ్లను మొత్తం కోల్పోతుందని భావించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థకు తెరలేపింది.

కబ్జా అనేది కొత్తది కాకపోయినప్పటికీ..

హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జా అనేది కొత్తది కాకపోయినప్పటికీ.. గత ప్రభుత్వాల కంటే.. గడచిన పది సంవత్సరాలలోనే ఈ కబ్జాలు మరింత పెరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలో హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దానికి ప్రత్యేక కార్యవర్గాన్ని నియమించారు. బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిపారు. రంగనాథ్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో చెరువుల్లో ఆక్రమించిన భవనాలను నేలకు కూల్చే పనిని హైడ్రా భుజాలకు ఎత్తుకుంది. ఇప్పటికే 50 కి మించి నిర్మాణాలను కూలగొట్టింది. తాజాగా శనివారం సినీ హీరో నాగార్జున చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టింది. ఈ ఘటనతో రేవంత్ రెడ్డి పై తెలంగాణ సామాజిక వాదులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

హిమాయత్ సాగర్ చెరువులో..

హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇదే హిమాయత్ సాగర్ చెరువులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, వి6 ఛానల్ అధిపతి వివేక్ కు, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు నిర్మించారు. అప్పట్లో వారు ఆ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే చెరువుల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పడగొట్టాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ నాయకులకు సంబంధించిన భవనాలను కూడా నేల కూల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం నాడు భారత రాష్ట్ర సమితి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చింది కాబట్టే.. ఇవాళ చెరువులు అన్యకాంతం అయిపోయాయని పేర్కొంటున్నారు. అయితే అక్రమ నిర్మాణాలను మొత్తం పడగొడతామని రంగనాథ్ చెబుతున్నారు. మరి కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ ల విషయం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.