CAG: కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక పదేళ్తు తెలంగాణ ముఖ్యమంత్రిగా సమసర్థవంతంగా పనిచేశారు. అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతుబంధు, రైతుబీమా, పింఛన్లకు మంచి గుర్తింపు ఉంది. అయితే కేసీఆర్ పాలన అంతా మేడిపండు చందమే అని కాగ్(ý ంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) స్పష్టం చేసింది. తొమ్మిదేళ్ల(2014–2023) పాలనలోని డొల్ల తనాన్ని బయట పెట్టింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన నిర్ణయాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన నిర్వహణ, ప్రజోపయోగ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వంటివి ఈ నివేదికలో ప్రధానంగా వెల్లడయ్యాయి.
ఆర్థిక నిర్వహణలో గందరగోళం..
తొమ్మిదేళ్లలో తెలంగాణ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.9.12 లక్షల కోట్లకు చేరింది, ఇందులో జీతభత్యాలు, పరిపాలన ఖర్చులు, రుణాల వడ్డీలు, చెల్లింపులు ప్రధాన భాగం. అదే సమయంలో, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన కేపిటల్ వ్యయం కేవలం రూ.2.55 లక్షల కోట్లతో సరిపెట్టారు. ఈ అసమతుల్యత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి లేనట్లు చూపిస్తుంది. రెవెన్యూ వ్యయంలో 85% జీతాలు, సబ్సిడీలు, నిర్వహణ ఖర్చులకే సరిపోయింది, కొత్త ఆస్తుల సృష్టి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
అప్పుల ఊబిలో రాష్ట్రం..
కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించలేదు. దీంతో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయి. 2014లో రూ.79,880 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు, 2023 నాటికి బడ్జెటరీ అప్పులు రూ.3.56 లక్షల కోట్లకు, బడ్జెటేతర అప్పులు రూ.1.98 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.5.07 లక్షల కోట్లకు చేరింది. జీఎస్‌డీపీలో గ్యారంటీ అప్పులు 10% మించకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తూ, తెలంగాణ 15% దాటిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఈ అప్పులు కేవలం అభివృద్ధి కోసం కాక, నిర్వహణ ఖర్చుల కోసం కూడా తీసుకోవడం గాడితప్పిన ఆర్థిక వ్యవస్తకు నిదర్శనం.
నిధులు మింగచేసిన కాళేశ్వరం..
కేసీఆర్ పాలనలో కాళేశ్వరం సింహభాగం నిధులను మింగేసింది. మొత్తం కేపిటల్ వ్యయంలో రూ.లక్ష కోట్లు నీటిపారుదలకు, ప్రధానంగా కాళేశ్వరంపై ఖర్చు చేశారు. సీతారామ, పాలమూరు వంటి ఇతర ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కాళేశ్వరం బరాజు నిర్మాణంలో అవినీతి, నాణ్యతా లోపాలు రాష్ట్రానికి భారమయ్యాయి.
విద్య, వైద్యంపై నిర్లక్ష్యం..
కేసీఆర్ పాలనలో విద్య, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. తొమ్మిదేళ్లలో విద్యపై కేవలం రూ.2,550 కోట్లు ఖర్చు చేయగా, వైద్య రంగంలో సంవత్సరానికి రూ.700 కోట్లు కూడా కేటాయించలేదు. తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణంలో భారీ పెట్టుబడులు పెట్టాయి, కానీ తెలంగాణ వెనుకబడిపోయింది. గురుకుల విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించే ప్రయత్నం కూడా గాలికొదిలేశారు.
పరిశ్రమలు, రవాణా ఆగమాగం..
తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి సన్నగిల్లింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు పరిశ్రమల ప్రోత్సాహం ద్వారా ఉద్యోగాలు సృష్టించాయి, కానీ తెలంగాణలో నిజాం సుగర్స్, రేయాన్స్ వంటి సంస్థలు దుర్వినియోగంతో కుదేలయ్యాయి. ఇక రవాణా రంగంలో కేవలం రూ.19,948 కోట్లు ఖర్చు చేశారు, ఇది ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. రహదారులు, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి భవిష్యత్తు ఉపయోగకరమైన మౌలిక వసతులపై పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి.
ప్రజోపయోగ పథకాల్లో డాంబికం…
మిషన్ భగీరథ కింద రూ.38 వేల కోట్లు, హౌసింగ్ కోసం రూ.13 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చూపించినా, ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం గొప్పలు చెప్పినా, అమలు నిరాశాజనకంగా సాగింది. ఇలాంటి పథకాలు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయి. విద్యుత్ రంగంలో రూ.21 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పినా, అదనపు విద్యుత్ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. పవర్ ప్రాజెక్టులు, కారిడార్‌లు వంటివి పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు.
కేసీఆర్ పాలన తెలంగాణను ఆర్థిక గందరగోళంలోకి నెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అతిగా దృష్టి సారించడం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా వంటి కీలక రంగాలను నిర్లక్ష్యం చేయడం, అప్పుల భారంతో రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టడం తదితర అంశాలను కాంగ్ స్పంగా వెల్లడించింది. తెలంగాణ స్వప్నం ఆర్థిక అస్తవ్యస్తతలో చిక్కుకున్న ఈ దశాబ్దం, రాష్ట్రానికి ఒక హెచ్చరికగా నిలిచింది. ఈ లోపాలను సరిదిద్దుకుని, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగడం ఇప్పుడు తెలంగాణకు ఉన్న అతిపెద్ద సవాల్.