Budget 2024: తెలంగాణ కోరిన గ్రాంట్లు నిర్మల ఇస్తారా?

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా దక్కలేదు. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 31, 2024 4:54 pm

Budget 2024

Follow us on

Budget 2024: భారత రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కేంద్రం నుంచి చాలా వరకు గ్రాంట్లు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ఆపన్నహస్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. గతంలో భారత రాష్ట్ర సమితిపై అనుసరించిన విధానాన్ని కాకుండా తమపై వెతక వైఖరి అవలంబించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సాధ్యమైన దానికంటే ఎక్కువ నిధులు ఆశిస్తోంది. అయితే ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టబోయేది తాత్కాలిక బడ్జెటే. అయినప్పటికీ చాలా ఎక్కువ నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో భారత రాష్ట్ర ప్రభుత్వం మాదిరి కాకుండా.. ప్రస్తుత కాంగ్రెస్ పెద్దలు పను డిమాండ్లను నేరుగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి కావలసిన నిధులను, ఇతర గ్రాంట్లను, ఉద్యోగుల కేటాయింపు పై ఆయన ముందు ఉంచారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చెప్పిన డిమాండ్ల మొత్తాన్ని విన్నారని.. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి సానుకూల కేటాయింపులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడం.. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బిజెపి భావిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణపై వరాలు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు ఏంటంటే

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా దక్కలేదు. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే 2014 తర్వాత దేశంలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాధాన్యం దృష్ట్యా ఇతర పథకాల కింద 60% నిధులు ఇస్తామని కేంద్రం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్రంలోని తొమ్మిది పాత ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున 450 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోరింది. కాదు 2021 నుంచి 22 వరకు, 2023 నుంచి 24 వరకు మొత్తం మూడు సంవత్సరాల కలిపి 1800 కోట్ల గ్రాంట్లు ఇవ్వాలని కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకు కేంద్రం మెగా లెదర్ పార్కు మంజూరు చేసిందని.. తెలంగాణ రాష్ట్రంలోనూ కరీంనగర్, జనగామ జిల్లాలో లెదర్ పార్కులు ఏర్పాటు చేయాలని… రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన భూమి కేటాయింపులను చేస్తామని కోరుతోంది. ప్రధానమంత్రి మిత్ర పథకంలో భాగంగా వరంగల్ లోని మెగా టెక్స్టైల్ పార్కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చిందని, దానికి గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలని కోరుతోంది. గ్రీన్ ఫీల్డ్ హోదా వస్తే 300 కోట్ల రూపాయల నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గుర్తు చేస్తోంది.. ఇక మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నూతన పారిశ్రామిక కారిడార్ కు పచ్చ జెండా ఉపాలని రాష్ట్రం కోరుతోంది. అంతేకాదు హైదరాబాద్, నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్ కు కూడా తుది అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్రం కోరుతోంది. ఒకవేళ తుది అనుమతులు మంజూరు చేస్తే 2,300 కోట్లు తమకు సమకూరుతాయని కేంద్రానికి రాష్ట్రం నివేదిస్తున్నది.

ఇక కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం 2,233.54 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసిందని.. నిధులు వెంటనే తమకు విడుదల చేయాలని రాష్ట్రం కోరుతోంది. యూపీ హయంలో హైదరాబాద్కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెంటర్ మంజూరయిందని… అప్పటి మంత్రి ఆనంద్ శర్మ ఈ పనులకు శంకుస్థాపన చేశారని.. రాష్ట్ర విభజన తర్వాత దీనిని విజయవాడకు తరలించుకుపోయారని.. హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో దీనిని ఇక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్రం కోరుతోంది. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరు చేస్తే ఇక్కడ నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని.. కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎస్ హెచ్ ఆర్ సి భవనాలు వినియోగించుకున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 408 కోట్లు ఇప్పించాలని తెలంగాణ కోరుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని పూర్తిగా రూపుమాపేందుకు నెలకొల్పిన ఈ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతం చేసేందుకు 88 కోట్లు, సైబర్ నేరాలు తగ్గించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బాలోపేతానికి 90 కోట్ల చొప్పున అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్రం అడుగుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని.. ఇందుకు గాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వీటిని నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. అంతేకాకుండా మెట్రో రైలు రెండో దశ పనులకు నిధులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు ఉన్న హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరి ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడం, దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా బిజెపి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాలు కురిపిస్తారో మరికొద్ది గంటల్లో తేలనుంది.