https://oktelugu.com/

Thummala Nageswara Rao : వచ్చే నెల నాలుగున ఆ పార్టీలో చేరిక, అక్కడి నుంచి పోటీ: క్లారిటీ ఇచ్చిన తుమ్మల

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఆయన పార్టీలోకి వస్తే కాంగ్రెస్‌ మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తుమ్మల రాక పట్ల సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

Written By: , Updated On : August 25, 2023 / 08:29 PM IST
Follow us on

Thummala Nageswara Rao : పాలేరు టికెట్‌ కందాల ఉపేందర్‌రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి మీద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంగా ఉన్నారు. ఇవ్వాళ హైదరాబాద్‌లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వచ్చిన నేపథ్యంలో ఆయన అనుచరులు భారీగా ఎదురేగి స్వాగతం పలికారు. అయితే ఎక్కడా కూడా కారు గుర్తు, ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ జెండాలను పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు.

కార్యకర్తలు కాంగ్రెస్‌ జెండాలతో ప్రదర్శన చేయడంతో తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖమ్మం వచ్చిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా తుమ్మలను ఆహ్వానించారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ఆయన పార్టీలోకి వస్తే కాంగ్రెస్‌ మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తుమ్మల రాక పట్ల సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

గత ఎన్నికల్లో పాలేరు నుంచి ఓడిపోయిన తుమ్మల.. ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలోనూ అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘పాలేరు నుంచి పోటీ చేస్తాను. ఇవే నాకు చివరి ఎన్నికలు. ఇక్కడ గెలిచి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పాదాలు కడుగుతానని’ వ్యాఖ్యానించారు. ఇక తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని ఆయన వర్గీయులు అంటున్నారు. కాగా, వచ్చే నెల నాలుగున కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీ సమక్షంలో తుమ్మల పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఢిల్లీ లేదా హైదరాబాద్‌ లేదా ఖమ్మంలో సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇక తుమ్మల అనుచరులు ప్రదర్శన నిర్వహించినప్పటికీ బీఆర్‌ఎస్‌ నేతలు ఇంత వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.