https://oktelugu.com/

Chalo Medigadda: బీఆర్ఎస్ చలో మేడిగడ్డ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బస్సు ద్వారా మేడిగడ్డ ప్రాంతానికి చేరుకున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 27, 2024 / 03:49 PM IST
    Follow us on

    Chalo Medigadda కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మార్చి 1న మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శిస్తామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా ప్రకటించారు. కాళేశ్వరం పై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అందుతున్న ఫలాలను ప్రజలకు వివరించాలి.. మేడిగడ్డ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తామని.. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

    ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బస్సు ద్వారా మేడిగడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు.. నిర్మాణ సంస్థ సూచించిన డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. దీనంతటికీ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ప్రాంతంలో కుంగిపోయిన పిల్లర్లను రాష్ట్ర మీడియాకు మాత్రమే కాకుండా “రాహుల్” ఆధ్వర్యంలోని జాతీయ మీడియాకు కూడా రేవంత్ రెడ్డి దగ్గరుండి చూపించారు.

    సరిగ్గా అదే రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్లగొండలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించొద్దంటూ భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఉన్నదా.. నన్ను అడిగితే నేను చెబుతా కదా. మేడిగడ్డలో లొట్ట పీసు కూడా లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే మేడిగడ్డకు సంబంధించి పిల్లర్లు కుంగిపోయిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. మేడిగడ్డ ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతల పథకానికి సంబంధించి గతంలో ఎలాంటి డిజైన్ రూపొందించారు? అందులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఎంత? ముందుగా దానిని ఎన్ని కోట్లతో నిర్మించాలి అనుకున్నారు? తర్వాత అంచనా వ్యయం ఎందుకు పెంచారు? అనే కోణాల్లో ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ ద్వారా నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన ప్రాంతాన్ని విజిలెన్స్ కమిటీ పరిశీలించింది. అప్పట్లోనే ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది.

    ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత చాలా రోజులకు భారత రాష్ట్ర సమితి స్పందించడం పట్ల రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేడిగడ్డ వద్ద తోకమట్టలేదని కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. అక్కడ ఏర్పడిన పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు కొత్తగా భారత రాష్ట్ర సమితి నాయకులు ఏం చూపిస్తారు అని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారని.. కానీ వారు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితి మేడిగడ్డ సందర్శన కాదని.. అది ఎందుకు కుంగిపోయిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం మొత్తం సందర్శిస్తామని చెబుతున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.. దాని ద్వారా ఎంత అప్పు తెచ్చింది?, ఎంత కొత్త ఆయకట్టు స్థిరీకరణ చేసింది? దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన రాబడి కూడా వివరించాలని కోరుతున్నారు. అటు భారత రాష్ట్ర సమితి, ఇటు కాంగ్రెస్ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడంతో కాలేశ్వరం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.