MLC Kavitha: ఐదు నెలల జైలు జీవితం.. 11 కిలోల బరువు తగ్గిన కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చింది. 153 రోజులుగా ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : August 27, 2024 3:12 pm

MLC Kavitha(1)

Follow us on

MLC Kavitha: ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన తర్వాత.. కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. అటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులను పలుమార్లు ఆశ్రయించింది. ఆమె తరుపు న్యాయవాదులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెకు బెయిల్ రాలేదు. దీంతో చివరి ఆశగా ఇటీవల మళ్ళీ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.. బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. మంగళవారం అటు కవిత, ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థల న్యాయవాదుల వాదనలు విన్నది. అనంతరం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కవితకు బెయిల్ కచ్చితంగా వస్తుందని ఆశతోనే ఆమె భర్త అనిల్, భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సోమవారమే ఢిల్లీ వెళ్లారు. బెయిల్ కు సంబంధించి జరుగుతున్న విచారణను పర్యవేక్షించారు. ఆమెకు బెయిల్ రావడంతో హర్షం వ్యక్తం చేశారు.

గత ఏడాది మార్చి 15న కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నాటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఏప్రిల్ 15 న సీబీఐ కవితను అరెస్టు చేసింది. దాదాపు 5 నెలలుగా ఆమెను విచారణ ఖైదీగా కేంద్ర దర్యాప్తు సంస్థలు తీహార్ జైల్లో ఉంచాయి. జైల్లో ఉన్న సమయంలో కవిత పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అవి వరుసగా తిరస్కారానికి గురయ్యాయి. ఆమెకు గైనిక్ సమస్యలు కూడా తలెత్తడంతో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆయనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఐదు నెలలుగా రిమాండ్ ఖైదీగా కవిత ఉన్న నేపథ్యంలో.. ఏకంగా 11 కిలోల బరువు తగ్గారు.. జూలై 16న ఆమె తొలిసారిగా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను జూలై 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో ఆమెకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి దృష్టికి కవిత తీసుకెళ్లారు. కవిత సమస్యలు విన్న కావేరి.. ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేసేందుకు అనుమతించారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. చివరికి జైలు వైద్యులు ఆమెకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఆగస్టు 22న కవిత మళ్ళీ అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. తర్వాత భర్త అనిల్ సమక్షంలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కవితను తిరిగి జైలుకు తరలించారు. ఈ సమయంలో కవిత దాదాపు 11 కిలోల బరువు తగ్గారు..