https://oktelugu.com/

Kalvakuntla kavita : కల్వకుంట్ల కవితకు మళ్లీ ఏమైంది? ఆస్పత్రిలో ఎందుకు చేరింది?

తీవ్రజ్వరంతో పాటు కొన్ని గైనిక్ సమస్యల బారిన పడ్డారు. ఆమె మార్చి 15 నుంచి ఆగస్టు 27 వరకు జైలులోనే ఉండిపోయారు. ఆ సమయంలో జైలు అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స ఇప్పించారు. ఆమె జైలు నుంచి విడుదల అయి నెల రోజులు దాటింది. కానీ.. ఇంకా ఆ సమస్యలు ఆమెను వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 1, 2024 / 04:14 PM IST

    Kalvakuntla kavita

    Follow us on

    Kalvakuntla kavita :  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యారు. సుమారు మూడు నెలల అనంతరం ఆమె బెయిల్ పై రిలీజ్ అయ్యారు. దాదాపు నెల గడిచిపోయింది ఆమె జైలు నుంచి బయటకు వచ్చి కూడా. కానీ.. అప్పటి నుంచి ఆమె ఇంతవరకు ప్రజల్లోకి రాలేదు. ఆమె రాక కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. మరోవైపు.. రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం ఇప్పటికైనా ఆమె ప్రజల్లోకి వస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

    బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కవిత ఎంతో యాక్టివ్‌గా పనిచేశారు. ఇటు పార్టీ కోసం.. అటు ప్రజల కోసం నిత్యం పరితపించారు. రాష్ట్రవ్యాప్తంగానూ పొలిటికల్‌గా తన మార్క్ చూపించారు. ఎన్నికలు వచ్చాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొనే వారు. అటు జాగృతిని స్థాపించి.. తెలంగాన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచం నలువైపులా చాటారు. ముఖ్యంగా బతుకమ్మ ఉత్సవాలతో ప్రపంచాన్ని చుట్టేశారు. విదేశాల్లోనూ బతుకమ్మ పేర్చి, ఆడిపాడి అక్కడి వారిలో పండుగ వైభవాన్ని చాటారు.

    ఇదిలా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 15 కవితను అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 15న సీబీఐ కూడా అదుపులోకి తీసుకుంది. ఎక్సైజ్ పాలసీని సవరించే క్రమంలో అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్లకు అవసరమైన ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ, సీబీఐ ఎంక్వైరీ చేశాయి. చివరకు అరెస్టు చేశాయి. అయితే.. జైలులో ఉన్న సందర్భంలో కవిత పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. తీవ్రజ్వరంతో పాటు కొన్ని గైనిక్ సమస్యల బారిన పడ్డారు. ఆమె మార్చి 15 నుంచి ఆగస్టు 27 వరకు జైలులోనే ఉండిపోయారు. ఆ సమయంలో జైలు అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స ఇప్పించారు. ఆమె జైలు నుంచి విడుదల అయి నెల రోజులు దాటింది. కానీ.. ఇంకా ఆ సమస్యలు ఆమెను వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు వైద్య పరీక్షల నిమిత్తం ఆకస్మాత్తుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు.

    దాదాపు నాలుగు నెలల తరువాత జైలు నుంచి వచ్చిన కవిత.. అప్పటి నుంచి నీరసంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అనారోగ్యం సమస్యల నుంచి ఇంకా ఆమె కోలుకోలేదనే తెలుస్తోంది. మరోవైపు.. బతుకమ్మ ఉత్సవాల్లో కవిత పాల్గొనే అవకాశాలూ లేకపోలేదని ఆమె అభిమానులు అంటున్నారు. సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉండడంతో.. వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆమె భవిష్యత్ నిర్ణయం కూడా తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ అనారోగ్యం నుంచి కోలుకునే పరిస్థితి ఉంటే బతుకమ్మ ఉత్సవాలను కొనసాగించే అవకాశాలూ లేకపోలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. కవిత రాకకోసం ఇటు మహిళలు, ఆమె అభిమానులు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.