Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా స్వల్ప ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి.. తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రౌడీ షీట్ ఒపెన్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ గురించి నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చుని ఉన్న కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవాడివయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటలు పెరిగాయి. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి గట్టిగా తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడడంతో గొడవ పెద్దదైంది. దీంతో పక్కన ఉన్న వాళ్లు కౌశిక్ రెడ్డిని వారించి తీసుకెళ్లారు.
గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‍గా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాళ్లు విసురుతోన్నారు. ఇటీవల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో చోటు చేసుకున్న వివాదాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లిన సంగతి మరిచిపోకముందే ఆయన మరో అధికార పార్టీ ఎమ్మెల్యేపై రెచ్చిపోయారు. గతంలో అరికెపూడి గాంధీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు 132, 351 (2) బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఆ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి భౌతిక దాడికి పాల్పడ్డాడు.
దీంతో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 132, 115 (2), 352, 292 కింద కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదు కూడా నమోదైన తర్వాత పోలీసులు ఆయనపై సెక్షన్లు 126 (2), 115 (2) కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల సందర్భంగా టికెట్ల ధరల పెంపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ త్రీ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనితో కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.
అసలే అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి పాడి కౌశిక్ రెడ్డి మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆయన దూకుడు ప్రవర్తన పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి సంచలనం సృష్టించారు. తాను ఎన్నిక కాకపోతే తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలను బెదిరించాడని చెప్పాలి.ఇప్పటికే అనేకసార్లు వివాదాలకు కారణమైన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కసారి గెలిచిన తర్వాతే ఆయన అంత ఫైర్ చూపిస్తే, మళ్ళీ గెలిస్తే ఏమవుతుందో అని ప్రజా ప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు.