BRS on Caste Census : ముందుకు పోతే నుయ్యి.. వెనక్కి పోతే గొయ్యి.. కులగణనపై బీఆర్ఎస్‌లో డిఫెన్స్

కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ కులగణన చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన చేపడుతోంది. అయితే.. కులగణనపై బీఆర్ఎస్ స్ట్రాటజీని మాత్రం ఎక్కడా బయటపెట్టడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు కులగణన బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా తయారైంది.

Written By: Srinivas, Updated On : November 5, 2024 3:27 pm

BRS on Caste Census

Follow us on

BRS on Caste Census : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కులగణన హాట్ టాపిక్ అయింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించబోతున్నారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణ సైతం పూర్తిచేశారు. మొత్తం 75 ప్రశ్నలతో ఈ సర్వే కొనసాగుతోంది. దాదాపు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సర్వే కోసం ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కష్టపడుతోంది. సుమారు 48 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు. వారిలో 40వేల మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఈ క్రమంలో కులగణనపై స్టడీ కోసం నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హైదరాబాద్ నగరానికి వచ్చారు.

కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ కులగణన చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన చేపడుతోంది. అయితే.. కులగణనపై బీఆర్ఎస్ స్ట్రాటజీని మాత్రం ఎక్కడా బయటపెట్టడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు కులగణన బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా తయారైంది. ముందుకు పోతే నుయ్యి.. వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా పరిస్థితి ఉంది. ఇటీవల బీసీ నేత ఆర్ కృష్ణయ్య కులగణనకు బీసీ కమిషన్ ప్రామాణికం కాదని.. ప్రత్యేక కమిషన్ వేయాలంటూ హైకోర్టును ఆదేశించారు. దాంతో హైకోర్టు విచారణ జరిపించి కృష్ణయ్య వాదనను ఏకీభవించింది. ఫలితంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక కమిషన్ నియమించింది. అయితే.. మొన్నటివరకు హైకోర్టు వాదననే బీఆర్ఎస్ నేతలు వినిపించారు. ఎట్టకేలకు ప్రభుత్వం కూడా కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారి నోళ్లకు మూతలు పడ్డాయి. దాంతో ఇప్పుడు కులగణనపై ఏ ఒక్క గులాబీ నేత కూడా మాట్లాడడం లేదు.

కులగణన అంశం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడేసిందనే చెప్పాలి. దాంతో కులగణన అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నానా ఫీట్లు చేస్తోంది. రోజుకో ప్లాన్ చేస్తున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. అయితే.. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి కులగణన టాపిక్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తోంది. ఎందుకంటే.. కులగణనకు మద్దతు తెలిపితే కాంగ్రెస్ పనిని సమర్థించినట్లుగా అవుతుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో ఈ రెండు పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. అందుకే.. ఈ టాపిక్‌ను పెద్దగా పట్టించుకోకుండా వీలైనంత డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సకల జనుల సర్వే మాదిరే ఈ కులగణన కూడా. అప్పుడు ఒక్క రోజులే తెలంగాణ మొత్తాన్ని స్తంభింపజేసి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. అయితే.. ఆ డేటాను దేనికి వినియోగించారు.. ఎక్కడ పోయిందో కూడా ఎవరికీ తెలియదు. అంతేకాదు.. అలాంటి సర్వేనే కేంద్రం సర్వే నిర్వహించాలని కేసీఆర్ ఆ సమయంలో ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ సైతం అలాంటి సర్వేనే నిర్వహిస్తోంది. అయితే.. దీనిపై బీఆర్ఎస్ ఏం చెప్పబోతోందా అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగానూ కనిపిస్తోంది.