Congress-BRS : కాంగ్రెస్ రివర్స్ అటాక్.. బీఆర్ఎస్ ఇరకాటంలో పడిందా..?

హైడ్రా ఇప్పటివరకు వేలాది సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. ఎకరాల స్థలాన్ని ప్రభుత్వాన్ని రికవరీ చేసింది. సీఎం రేవంత్ ఏ లక్ష్యంతో అయితే హైడ్రా తీసుకొచ్చారో.. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగానే హైడ్రా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం సూచనలను, ఆదేశాలను పాటిస్తూ కబ్జాదారులకు చుక్కలు చూపిస్తూ వస్తోంది.

Written By: Srinivas, Updated On : October 2, 2024 12:52 pm

Congress-BRS

Follow us on

Congress-BRS : హైదరాబాద్ నగరాన్ని వరదల బారి నుంచి కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హైడ్రా వ్యవస్థకు రూపకల్పన చేశారు. ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాల బారి నుంచి కాపాడితే.. నగరాన్ని వరదల బారి నుంచి కాపాడుకోవచ్చనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. హైడ్రా ఇప్పటివరకు వేలాది సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. ఎకరాల స్థలాన్ని ప్రభుత్వాన్ని రికవరీ చేసింది. సీఎం రేవంత్ ఏ లక్ష్యంతో అయితే హైడ్రా తీసుకొచ్చారో.. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగానే హైడ్రా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం సూచనలను, ఆదేశాలను పాటిస్తూ కబ్జాదారులకు చుక్కలు చూపిస్తూ వస్తోంది. అయితే.. హైడ్రా వ్యవస్థను, అది చేపడుతున్న చర్యలను మాత్రం ముందు నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. తప్పు పడుతూనే ఉన్నాయి.

ఇందులో భాగంగా ఇటీవల మూసీ సందరీకరణ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా కలుషితమైన మూసీతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని ప్రభుత్వం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి పునరావాసం కల్పించాలని అనుకుంది. అందులో భాగంగా మూసీ చుట్టుపక్కల ఉన్న కట్టడాలను కూల్చివేయాలని హైడ్రాకు ఆదేశాలిచ్చారు. అదే క్రమంలో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి సర్వే చేసి ఇళ్లకు మార్కింగ్ చేశారు. దాంతో అప్పటి నుంచి అక్కడి వారి నుంచి నిరసన వ్యక్తమైంది. మూసీ పరిధిలోని ఇళ్లను ఖాళీ చేస్తే డబుల్ బెడ్ రూములు ఇవ్వడంతోపాటు పరిహారం కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే.. ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వం చెప్పిన ఆఫర్‌కు ఓకే చెప్పేసి డబుల్ బెడ్ రూములకు తరలిపోయారు. కానీ.. కొంత మంది మాత్రం అక్కడి నుంచి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను వదులుకొని తాము ఎక్కడికీ వెళ్లేది లేదని రోడ్లపైకి వచ్చారు. అలాగే.. బీఆర్ఎస్ కు చెందిన తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తమ పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. దాంతో మూసీ బాధితుల నిరసన కార్యక్రమాలను ఇప్పుడు బీఆర్ఎస్ నెత్తిన వేసుకుంది. మూసీ నదిలో గోదావరి జలాలలకు బదులు నిర్వాసితుల రక్తం పారించండి అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదిలేది లేదంటే మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు రోజులుగా వారితో సమావేశం అవుతూనే ఉన్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన కేటీఆర్ సైతం కోలుకొని నిన్నటి నుంచి ఫీల్డ్‌లోకి వచ్చారు. మూసీ బాధితులను కలిశారు. వారికి ధైర్యం చెప్పారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. నిన్న ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై రివర్స్ అటాకింగ్‌కు దిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్ఎస్ బాగోతాలను మొత్తం బయటపెట్టారు. అసలు మూసీ ప్రక్షాళన జీవోను తీసుకొచ్చిందే బీఆర్ఎస్ అని పెద్ద బాంబ్ పేల్చారు. 2017లోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని వివరించారు. అదే సమయంలో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు, బఫర్‌జోన్‌లో ఉన్న ఆవాసాల లెక్కతీశారని తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లు అప్పుడొక విధంగా ఇప్పుడొక విధంగా ప్రవర్తిస్తున్నారని వారి భండారాన్ని బయటపెట్టారు. రెండు నాలుకల ధోరణి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మున్సిపల్ మంత్రి హోదాలో కేటీఆర్ మూసీ ప్రక్షాళనకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అప్పటి అధికారులను ఆదేశించారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆయన మాటలున్న మినిట్స్‌ను బహిరంగ పరిచారు. ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా ప్రకటించి.. 8,480 అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు. వాటిని కూల్చేందుకు సైతం జీవో జారీ చేవారని మంత్రి తెలిపారు. ఈ మేరకు అప్పటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఇక 2021లో కూడా అక్రమ కట్టడాలను కూల్చి ఆర్అండ్ఆర్ ప్రకారం వారికి పరిహారం ఇచ్చేలా కేటీఆర్ ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మూసీకి ఇరువైపులా మొత్తంగా 110 కిలో మీటర్ల మేరకు రోడ్లు వేయాలని ఆదేశించారని తెలిపారు. జీవో 7/2016 తీసుకొచ్చి అక్రమ కట్టడాలను కూల్చాలని ఆదేశాలు కూడా ఇచ్చారని శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ చేసింది ఒప్పు అని చెప్పుకుంటూ.. తాము చేసేది తప్పు అని విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

మంత్రి శ్రీధర్ బాబు మినిట్స్‌తో సహా ఆధారాలు బయటపెట్టడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. ఈ ఆరోపణల గురించి ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. కేటీఆర్ తీరుపై ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో తీవ్ర చర్చ నడుస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ అప్పుడు ఒకవిధంగా.. ఇప్పుడు మరో విధంగా మాట్లాడడంపై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రభుత్వం విమర్శల నుంచి ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియక బీఆర్ఎస్ పార్టీ సైతం ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. పదేళ్ల రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఓ అంశాన్ని నెత్తిన ఎత్తుకునేముందు వెనుక ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ నిపుణులు సైతం సూచిస్తున్నారు.