Babar Azam : బాబర్ తప్పుకున్నాడు.. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు దిక్కెవరు? నడిపించే నాయకుడెవరు?

వరుస ఓటములు.. జట్టులో లోపించిన ఐక్యత.. అంతర్గత సమస్యలు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరువు తీస్తున్నాయి.. వరుస ఘటనలు పాక్ క్రికెట్ ను అభాసుపాలు చేస్తున్నాయి. ఇవి ఇలా ఉండగానే పాకిస్తాన్ జట్టు లో మరో సంచలనం చోటుచేసుకుంది. దీంతో మరోసారి ఆ జట్టు వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 2, 2024 12:35 pm

Babar Azam

Follow us on

Babar Azam :  పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. కెప్టెన్సీ బాధ్యతలకు ఇక వీడ్కోలని ప్రకటించాడు. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దారుణమైన ప్రదర్శన చేసింది. అయితే జట్టు వైఫల్యానికి బాధ్యత తనదేనని ప్రకటిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ వైదొలిగాడు. టి20 వరల్డ్ కప్ముందు వీటి వల్ల పాకిస్తాన్ మేనేజ్మెంట్ బాబర్ ను మళ్లీ కెప్టెన్ గా నియమించింది. అయితే ఆ టోర్నీ లోనూ పాకిస్తాన్ జట్టు వైఫల్యాలను మూటగట్టుకుంది. చివరికి అమెరికా చేతిలో ఓటమిపాలైంది. దశలోనే నిష్క్రమించింది. ఇక కెప్టెన్సీ మార్పుల వల్ల పాకిస్తాన్ జట్టులో ఐకమత్యం దెబ్బ తిన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్లు పరస్పరం గొడవలు పడుతున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో బాబర్ ను కెప్టెన్సీ నుంచి పక్కన పెడతారని వార్తలు మొదలయ్యాయి.అయితే మేనేజ్మెంట్ ఆ నిర్ణయం తీసుకోకముందే బాబర్ తను ఆ బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నానని వెల్లడించాడు. ఈ నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల తను బ్యాటింగ్ మీద దృష్టి సారించడానికి ఆస్కారం ఏర్పడుతుందని వివరించాడు.

బాబర్ ట్విట్టర్ ట్వీట్ ఇలా..

” ప్రియమైన అభిమానులారా.. ఓ విషయాన్ని మీతో చెప్పాలని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టు నాయకత్వ బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటున్నాను. గత నెలలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మేనేజ్మెంట్ కు విషయాన్ని వెల్లడించాను. జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప విషయం. అని నా బ్యాటింగ్ పై దృష్టి సారించాలని ఉద్దేశంతోనే సారధ్య బాధ్యత నుంచి తప్పుకున్నాను. సరైన సమయంగా నేను భావిస్తున్నాను. సారధ్య బాధ్యత నాకు గొప్ప అనుభూతి. అరుదైన బహుమతి. కెప్టెన్సీ వల్ల పనిభారం పెరుగుతోంది. నా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాను. కుటుంబంతో సమయాన్ని గడపాలని అనుకుంటున్నాను. నాపై నమ్మకం పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. నేను సాధించిన ఘనతల పట్ల సంతోషిస్తున్నాను. మీ ప్రేమకు, మీరు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలని” బాబర్ వివరించాడు.

గతంలో జరిగింది ఇదీ..

వన్డే వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత పాకిస్తాన్ మేనేజ్మెంట్ టి20 లకు బాబర్ స్థానంలో షాహిన్ ఆఫ్రిది ని సారధిగా నియమించింది. కానీ అతడికి న్యూజిలాండ్ సిరీస్ వరకే అవకాశం లభించింది. ఆ తర్వాత బాబర్ ను పాకిస్తాన్ మేనేజ్మెంట్ కెప్టెన్ గా నియమించింది. అయితే బాబర్ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోవడంతో.. ఆస్థానంలో మహమ్మద్ రిజ్వాన్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనున్నారు. ఆ సమయం నాటికి జట్టును పటిష్టం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నది. అయితే ఇంతలోనే బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఒకసారి గా సంచలనం కలిగించింది.