BRS Foundation Day: నాటి “యూటీ టీఆర్ఎస్” గతించింది..నేటి “బీటీ బీఆర్ఎస్” మాత్రమే మిగిలింది

2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. ఆ పార్టీ 2014 వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. కీలక నేతలు బయటకు వెళ్లినప్పటికీ కెసిఆర్ తన వ్యూహ చతురతతో పార్టీని బతికించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 27, 2024 3:17 pm

BRS Foundation Day

Follow us on

BRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది సరిగ్గా ఇదే రోజు. ఈ రోజునే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించాలి. ఎన్నికల హడావిడి ఉంది కాబట్టి, పెద్దగా కార్యక్రమాలు వద్దు. పార్టీ కార్యాలయాల్లో మాత్రమే జెండాలు ఎగురవేయాలి” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు చేసిన ఆదేశాలు. నిజంగా ఆయన పిలుపునిచ్చినా, ఇవ్వకపోయినా కార్యకర్తలు బయటికి వచ్చి భారీగా వేడుకలు జరిపే పరిస్థితి లేదు. ఎన్నికలని సాకు చెబుతున్నారు గాని.. వాస్తవానికి సంబరాలు చేసుకునే సన్నివేశం భారత రాష్ట్ర సమితి కార్యవర్గంలో ఇప్పటికైతే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి.. కార్యవర్గం చెల్లా చెదురు కావడం.. కీలక నాయకులు కండువాలు మార్చడంతో.. కారు పార్టీ కకావికలమైపోతోంది. పులి మీద పుట్రలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు, కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిగిపోవడం, దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడం, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలు భారత రాష్ట్ర సమితిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కెసిఆర్ లాంటి వ్యక్తి బయటికి రావడం.. వరుసగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం.. అంతకుముందు నల్లగొండ, కరీంనగర్, జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటించడం.. ఇటీవల ఓ ప్రైవేట్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ పార్టీ కార్యవర్గానికి భరోసా లభించడం లేదు.. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారు కూడా చించుకొని పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు.

2001 ఏప్రిల్ 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. ఆ పార్టీ 2014 వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. కీలక నేతలు బయటకు వెళ్లినప్పటికీ కెసిఆర్ తన వ్యూహ చతురతతో పార్టీని బతికించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భారత రాష్ట్ర సమితి పనైపోయిందని చాలామంది అనుకున్నారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించడంతో.. కనీసం పార్టీ కార్యాలయమైనా మిగులుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒకానొక సందర్భంలో కేసీఆర్ తెలంగాణ భవన్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ కార్యాలయాన్ని కాపాడుకునే క్రమంలో ఆయన అక్కడే పడుకోవాల్సి వచ్చింది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో.. కెసిఆర్ తన రాజకీయ చతురతను ప్రదర్శించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్లో అస్థిరత.. ఢిల్లీ పెద్దలకు అవగాహన లేని వంటి విషయాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీంతో తెలంగాణలో రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశారు. ఇక అప్పటినుంచి తనకు ఎదురన్నది లేకుండా చూసుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. కెసిఆర్ రకరకాల రాజకీయాలు ప్రదర్శించారు. తెలంగాణ రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కొన్ని పార్టీలను విలీనం కూడా చేసుకున్నారు. తెరపైకి బంగారు తెలంగాణ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు కూడా పెట్టించారు. ఏకంగా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంటామని కలగన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని బీ ఆర్ ఎస్ చేశారు. ఇక అప్పటినుంచి కెసిఆర్ జాతకం ఒక్కసారిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. దీంతో వాస్తవం అర్థం కావడంతో కేసీఆర్ మళ్ళీ భారత రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్ర సమితి లాగా మార్చలేక.. తన పార్టీ కేవలం తెలంగాణ కోసమే పుట్టిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తనను తెలంగాణ కోసమే భగవంతుడు పుట్టించాడని ప్రజల ఎదుట వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి తమ ఆశల్ని అడియాసలు చేసిందని ప్రజలు భావించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తమలో గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని ఒక్కసారిగా బట్టబయలు చేశారు. అందుకే కెసిఆర్ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.. తనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ బస్సు యాత్ర చేస్తున్నారు. సింపతి కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం నాటి రోజులు కావివి. ఏది నిజమో, ఏది అబద్దమో ప్రజలకు మొత్తం తెలుసు. అలాంటప్పుడు కాకలు తీరిన కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు ప్రదర్శించే రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయనే గ్యారంటీ ఇప్పుడు లేదు. అంటే ఇవి ఫలించక పోవని కూడా లేదు. ప్రస్తుతం కెసిఆర్ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని సీట్లు ఆ పార్టీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేకపోతే.. వచ్చే ఆవిర్భావ దినోత్సవ నాటికి పార్టీ జెండా ఎగరవేసే పరిస్థితి కూడా ఉండదు. దీనంతటికీ కారణం స్వయంకృతాపరాధమే.. చేసిన తప్పుల నుంచి భారత రాష్ట్ర సమితి గుణపాఠం నేర్చుకుంటుందా? తెలంగాణ రాష్ట్ర సమితిగా మారుతుందా? తెలంగాణ ఇంటి పార్టీగా ప్రజలకు చేరువవుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.