Congress : రాజకీయాలు ఇలానే ఉండాలని లేదు. ఇలా ఉంటేనే వాటిని రాజకీయాలు అనాలని లేదు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో.. అనే పద్యమే రాజకీయాలకు వర్తిస్తుంది. 2014లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెల్లువలా అందులోకి వెళ్లారు. 2018 లోనూ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. అవసరం లేకున్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఏకంగా తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని భారత రాష్ట్ర సమితిలో విలీనం చేసేలా పావులు కదిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఆ గెలుపును అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ పెద్దగా లెక్కలోకి కనిపించలేదు.. పైగా అవకాశం దొరికినప్పుడల్లా ఈ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందంటూ శాపనార్థాలు పెట్టారు. కెసిఆర్ అయితే ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.. అటు బిజెపి నాయకులు కూడా ఇలానే మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, పార్టీని బలోపేతం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తారు. అధిష్టానం కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటివరకు భారత రాష్ట్ర సమితి నుంచి కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా చేరిన వారిలో కొందరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అయితే మునుముందు ఇంకా చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు చేరతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.. పార్లమెంట్ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అదే పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి బరిలో నిలిచారు. వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం టికెట్ దక్కించుకున్నారు. ఖైరతాబాద్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, బిజెపి నాయకుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవి కూడా దక్కించుకున్నారు.
భారత రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూడా గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, హైదరాబాద్ విజయలక్ష్మి తో కలిసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కల్పిస్తోంది. తన చివరి జీవితంలో కాంగ్రెస్ పార్టీలో చేరి.. అందులోనే కన్నుమూయాలని భావిస్తున్నట్టు కేశవరావు ప్రకటించారు.. తాము కాంగ్రెస్ పార్టీ లో చేరే క్రమంలో ఎవరినీ అందులోకి తీసుకువెళ్ళడం లేదని మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. వీరు మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా భారత రాష్ట్ర సమితి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
భారత రాష్ట్ర సమితి నాయకులు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఇప్పటికే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పదవి కూడా దక్కించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు చాలామంది బిజెపి అసంతృప్త నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కూలగొడతామని అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి అటు పార్టీని కాపాడుకుంటూనే.. ఇటు ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు గాని.. ప్రస్తుతానికైతే కెసిఆర్ 2014లో అనుసరించిన విధానాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు.