KCR : “కడియం శ్రీహరి మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిలో పదవులు పొందాడు. డిప్యూటీ సీఎం హోదా కూడా అనుభవించాడు. అతడు అడిగితే కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా కేటాయించాడు. అయినప్పటికీ విశ్వాసం లేకుండా కడియం శ్రీహరి బయటికి వెళ్లిపోతున్నాడు. కష్టకాలంలో కూతురి భవిష్యత్తు అని సాకులు చెబుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. ఇన్ని రోజులు పార్టీ అవకాశాలు కల్పించిందనే సానుభూతి కూడా లేకుండా కూతురితో ఏకంగా లేఖ కూడా రాయించి విడుదల చేశాడు.. ఇది రాజకీయాల్లో సరైన పరిణామం కాదు” ఇదీ భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో జరుగుతున్న చర్చ.
ఆ గ్రూపులలో జరుగుతున్న చర్చ ప్రకారం కడియం శ్రీహరి తప్పు చేశాడు అనుకుందాం. రాజకీయాల్లో అది సరైన విధానం కాదని కాసేపు సమర్ధించుకుందాం. కానీ నాడు కేసీఆర్ ఏం చేశారు? తన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన కూడా రకరకాల ఎత్తులు, చిత్తులు వేశాడు కదా! ఏకంగా కేటీఆర్ ను భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడిని చేశారు కదా! కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కేటీఆర్ అన్ని శాఖల్లోనూ వేలు పెట్టేవారని విమర్శలు ఉండేవి. చివరికి ఆయన షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించే వాడనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసిన ఆమె ఓడిపోయింది. ఏడాది తిరగక ముందే ఆమెకు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. కవిత మాత్రమే కాదు ఆ ఎన్నికల్లో దాదాపు ఏడుగురు భారత రాష్ట్ర సమితి ఎంపీలు ఓడిపోయారు. కానీ వారిలో ఎవరికి ఎమ్మెల్సీ వంటి పదవులు దక్కలేదు. కేవలం కవిత కేసీఆర్ కుమార్తె అయినందువల్లే ఆమెకు ఎమ్మెల్సీ దక్కిందనే వాదనలు ఉన్నాయి. మరి అప్పుడు కేసీఆర్ అలా చేస్తుంటే ఎవరూ నోరు ఎందుకు మెదపలేదు?
బయటికి ఇలాంటి నిజాలు కనిపిస్తున్నప్పుడు కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు ఎలా విమర్శిస్తారు? ఇది సరైన రాజకీయం కాదు. శ్రీహరి చేస్తున్నది ముమ్మాటికి తప్పు. మరి గతంలో కేసీఆర్ చేసిందేంటట? ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడు కదా. చివరికి కమ్యూనిస్టు పార్టీని కూడా వదిలిపెట్టలేదు కదా.. అలాంటప్పుడు కడియం శ్రీహరి, పోతుగంటి రాములు వంటి వారు భారత రాష్ట్ర సమితి వదిలి వెళుతుంటే ఎందుకు విమర్శలు చేయడం.. ఒకవేళ భారత రాష్ట్ర సమితి విలువల ఆధారంగా రాజకీయాలు చేస్తే కచ్చితంగా కడియం శ్రీహరిని విమర్శించేందుకు ఆస్కారం, అవకాశం ఉండేది. కానీ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు చేయవలసినవి మొత్తం చేసి.. ఇప్పుడు శుద్దపూసలాగా విమర్శలు చేయడమే విధి వైచిత్రి.
కేకే కు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు. చివరికి ఆయన కూతురిని హైదరాబాద్ మేయర్ ని కూడా చేశారు. అలాంటి వ్యక్తి పార్టీ మారడం కరెక్ట్ కాదని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు.. కానీ నాడు కేకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. అందులో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చేరవేసినట్టు విమర్శలున్నాయి. అలా కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలను వాడుకున్నారు. వాటిని చెప్పినందుకు కేకే కు కీలక స్థానాలు కట్టబెట్టారు. ఇప్పుడు కేసీఆర్ తో అవసరం తీరిపోయింది. ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పైగా తన బిడ్డకు రెండు సంవత్సరాలపాటు హైదరాబాద్ మేయర్ గా పనిచేసే సమయం ఉంది. హైదరాబాద్ మున్సిపాలిటీలో ఏవైనా పనులు చేయాలంటే అధికార పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ కావాలి. అలాంటప్పుడు బిడ్డ భవిష్యత్తు కోసం కేకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయాడు. ఇందులో తప్పేముంది. రాజకీయాలు మొత్తం భ్రష్పటు ట్టిపోయిన తర్వాత.. ఇలాంటి అవకాశవాదాలే తెరమీదకు వస్తాయి. కేకే సంగతి పక్కన పెడితే నాడు కేసీఆర్ కు ఎన్టీఆర్ రాజకీయ భిక్షపెట్టారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి సిద్దిపేటకు ఎమ్మెల్యేను చేశారు. శాసనసభలో ఉప సభాపతిగా నియమించారు. అది నచ్చకపోవడం వల్లే కేసీఆర్ బయటికి వచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. కానీ ఇదే కేసీఆర్ కవిత కోసం, కేటీఆర్ కోసం ఎన్నో రాజకీయ వేదికలు ఏర్పాటు చేశారు.. ఆయన ప్రభుత్వంలో వారికి కీలక స్థానాన్ని కల్పించారు. అలాంటప్పుడు కేకే, కడియం శ్రీహరి, పోతుగంటి రాములు చేసిన దాంట్లో తప్పేముంది. వారిని కొంతమంది విమర్శించవచ్చు.. మరి కొంతమంది పార్టీ మారకుండానే భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేగా ఎలా చేరుతారని తప్పు పట్టవచ్చు. కానీ వీటన్నింటికీ ఆద్యుడు కేసీఆర్ అని మాత్రం మర్చిపోవద్దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..