BRS 2025 Roundup: కాలం గిర్రున తిరిగింది. 2025 మరో ఐదు రోజుల్లో కాలగర్భంలో కలవబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అనుభవాలను నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, బిజినెస్ మెన్లు సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటునర్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కీలక ప్రతిపక్షం అయిన బీఆర్‌ఎస్ 2025లో చేసిన పోరాటాలు, పార్టీలో జరిగిన కీలక పరిణామాలు.. ఎదుక్కొన్న ఇబ్బందులు.. ఎన్నికల్లో గెలుపు ఓటములు తదితర వివరాలతో రౌండప్
రైతు సమస్యలపై పోరాటం..
ఏడాది ప్రారంభంలో రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటాల చేసింది. సన్న వడ్లతోపాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో రైతుభరోసా డబ్బుల కోసం కూడా ఆందోళనలు చేసింది. ఇక కేసీఆర్ ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎరువుల సమస్యపై పోరాటాలు చేసింది.
మూసీ పునరుజ్జీవంపై..
ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో బీఆర్‌ఎస్ హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవంతోపాటు హైడ్రా కూల్చివేతలపై ఉద్యమం చేసింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను హైడ్రా కూల్చివేసింది. దీంతో చాలా మంది నిర్వాసితులయ్యారు. హరీశ్‌రావు, కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. జేసీబీలు తమ మీది నుంచి పోనివ్వాలని అడ్డుకున్నారు. అయితే ప్రభుత్వం మూసీ పక్కన ఉన్నవాళ్లకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయించింది. దీంతో వివాదం సద్దుమణిగింది.
పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలతో అంతర్గత విభేదాలు..
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్‌లో నిర్వహించారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. భారీగా క్యాడర్‌ను సమీకరించారు. అయితే వేదికపై కేవలం కేటీఆర్ ఫ్లెక్సీ మాత్రమే ఏర్పాటుచేయడం. వేదికపై కేసీఆర్ బీజేపీని విమర్శించకపోవడాన్ని కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సే కవిత ప్రశ్నించారు. ఈ విషయమై తండ్రికి లేఖ రాశారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కవిత.. విడుదలైన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకలతోనే యాక్టివ్ అయ్యారు.
కవితపై సస్పెన్షన్ వేటు..
కవిత అమెరికాలో ఉండగా.. కవిత కేసీఆర్‌కు రాసిన లేఖను బీఆర్‌ఎస్ నేతలు మీడియాకు విడుదల చేశారు. ఇది పెద్ద రచ్చ అయింది. పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత లేఖ రాసిన విషయం అంగీకరించారు. అంతటితో ఆగకుండా లేఖను హరీశ్‌రావు కావాలని బయటపెట్టారని మండిపడ్డారు. పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో అధిష్టానం.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కవిత జనం బాట..
కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాలుగు రోజులకు ప్రెస్‌మీట్ పెట్టారు. అధిష్టానానికి అనేక ప్రశ్నలు వేశారు. అనంతరం తన సొంత వేదిక తెలంగాణ జాగృతిని బలోపేతం చేశారు. ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. దసరా తర్వాత జనం బాట పేరుతో జనంలోకి వెళ్లారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించారు. సుమారు రెండు నెలల పర్యటనతో ఆమె జనం లోకి వెళ్లినా.. పెద్దగా ఆదరణ రాలేదు. మరోవైపు కవిత జనంబాటలో ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయకుండా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసింది. దీంతో బీఆర్‌ఎస్ నేతలు కూడా కేసీఆర్ కూతురు అని కూడా చూడకుండా కవితపై ప్రత్యారోపణలు, విమర్శలు చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి..
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌కు 2025లో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కలిసిరాలేదు. ఉప ఎన్నిల్లో గెలిచి. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీఈఆర్‌ఎస్ నేతలు భావించారు. వ్యూహాత్మకంగా అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థిని ప్రకటించారు. కానీ, ప్రచారంలో అనైక్యత, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, అధికార కాంగ్రెస్ తన శక్తినంతా మోహరించడంతో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పలేదు.
కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్..
ఫార్ములా ఈ–రేసు కేసుకు సంబంధించి కేటీఆర్‌ను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏసీబీ త్వరలోనే కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. ఈమేరకు త్వరలో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. 2026లో ఈ కేసుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక కళేశ్వరం అవకతవకలపై నియమించిన పీసీ ఘోష్ కమిటీ ఈ ఏడాది నివేదిక సమర్పించింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోట్టు చేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను విచారణ చేసిన సిట్ కీలక విషయాలు రాబట్టింది. దీంతో 2026లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశం ఉంది. అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల్లో గెలుపుతో ఊరట..
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా.. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 7 వేల పైచిలకు మంది గెలవగా, 3 వేల మంది వరకు బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఇదే ఆ పార్టీకి పెద్ద ఊరటగా భావిస్తోంది. పల్లెల్లో తమ పార్టీకి ఇంకా పట్టు ఉందని నేతలు భావిస్తున్నారు.
బయటకు వచ్చిన బాపు..
ఇక ఏడాది చివరన గులాబీ బాస్. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బయటకు వచ్చారు. ఏడాదంతా ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోయారు. అక్కడి నుంచే పార్టీ కార్యాకలాపాలపై సమీక్ష చేశారు. అసెంబ్లీ సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. కానీ మీడియా ముందుకు రాలేదు. కనీసం తెలంగాణ భవన్‌లో కూడా అడుగు పెట్టలేదు. తాజాగా నాలుగు రోజుల క్రితం తెలంగాణ భవన్‌కు వచ్చి.. కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు చేశారు. సీఎం సొంత జిల్లా, కృష్ణా జలాల్లో అన్యాయంపై విమర్శలు చేశారు. ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. కానీ మళ్లీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
మొత్తంగా 2025 బీఆర్‌ఎస్‌కు పెద్దగా కలిసి రాలేదు. కానీ పంచాయతీ ఎన్నికల్లో పెరిగిన మద్దతు ఆ పార్టీకి భవిష్యత్‌పై ఆశలు చేపింది. అదే సమయంలో కేసీఆర్ పామ్‌హౌస్ నుంచి బయటకు రావడం, ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉంటానని ప్రకటించడం పార్టీకి పెద్ద బూస్ట్‌గానే భావిస్తున్నారు గులాబీ నేతలు. మరి 2026 అయినా పార్టీకి కలిసి రావాలని ఆశిద్దాం..