Amit Shah : ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష.. బీజేపీ భరోసా బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన ఆధ్వర్యంలో పాలిస్తున్న కుటుంబ పార్టీకి అవకాశం ఇస్తే మళ్లీ ప్రజలను మోసం చేస్తారని హెచ్చరిం చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలే.. సోనియా గాంధీ కుటుంబం కోసం, తన కుమారుడి కోసం పని చేస్తోందని, కేసీఆర్ కూడా సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకుని పని చేస్తున్నారని ఆరోపించారు. కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉందని, ఓవైసీతో కలిసి తెలంగాణ పోరాట యోధులను విస్మరించారని అమిత్‌షా ఆరోపించారు. ‘తెలంగాణ అమరుల కలలను బీఆర్‌ఎస్ నాశనం చేసింది. కేసీఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతుంది. తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని’ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్‌ఎస్ 2 జీ పార్టీ, ఎంఐఎం 3 జీ పార్టీ. తెలంగాణలో మాత్రం అధికారంలోకి వచ్చేది మోడీ పార్టీనే అని అమిత్‌షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరెస్ట్‌లతో బీజేపీ నేతలను భయపెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని, అలాంటి ఆటలు ఇకపై చెల్లవని అమిత్‌షా హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, అది ఎంత మాత్రం నెరవేరదని షా స్పష్టం చేశారు. ఓవైసీ నడిపే కారును మళ్లీ గెలిపించొద్దని తెలంగాణ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు
బీఆర్‌ఎస్‌కు ఓట్లువేస్తే కాంగ్రెస్‌కు వేసినట్లేనని, కాంగ్రెస్‌కు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని ఈరెండింటికి ఓట్లువేస్తే మజ్లిస్‌కు వేసినట్లేనని షా విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒకే గూటి పక్షులని, మజ్లిస్‌తోపాటు ఒకే తాను ముక్కలని, మూడింటి డీఎన్‌ఏ ఒక్కటేనని ధ్వజమెత్తారు. అనేక ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ అవినీతి పాలన ప్రజలకు తెలియందికాదన్నారు. తెలంగాణ ప్రజల జీవనంలో మార్పులు రావాలంటే ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీతోనే సాధ్యమని, రైతులకు అండగా నిలబడుతున్న బీజేపీని అదరించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో కమీషన్ల ప్రాజెక్టులు తప్ప, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు నిర్మాణం కాలేదని, కోటి ఎకరాల మాగాణం ఏమైందని నిలదీశారు. ధరణి పోర్టల్ పేరుతో కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా రైతుల పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో 20లక్షల మంది రైతులు ధరణితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.