Telangana Assembly Election: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని దఫ దఫాలుగా తీసుకొస్తున్నారు. సానుకూల పవనాలు వేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని కార్యకర్తలు కలిగిస్తున్నారు. పలుచోట్ల భారీ సభలో నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తున్నారు. పార్టీకి బలంగా ఉన్న దక్షిణ తెలంగాణతో పాటు, పట్టు కోల్పోయిన ఉత్తర తెలంగాణలోనూ ఆయన విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. రెండవ విడత జాబితా విడుదలైన తర్వాత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే టికెట్లు ఖరారైన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో చురుకుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా ఫోకస్ చేయడంతో పార్టీ గతంలో లేనంత విధంగా బలంగా కనిపిస్తోంది.
ఇక భారత రాష్ట్ర సమితి విషయానికి వస్తే.. గతానికంటే భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. 2018 ఎన్నికలతో పోల్చితే విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఆయన ప్రసంగంలో మునపటి లాగా వాడి లేకపోయినప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీనే ఆయన టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కేటీఆర్, హరీష్ రావు కూడా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. మీడియాను మాత్రమే కాదు సోషల్ మీడియాని కూడా బలంగా వాడుకుంటున్నారు. టీవీ9 లో ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జయప్రకాష్ నారాయణ్ తో కూడా కేటీఆర్ ముఖాముఖిలో పాల్గొన్నారు. హరీష్ రావు కూడా పలు పత్రికలకు సంబంధించిన ఎడిటర్లతో ముఖాముఖి నిర్వహించారు. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఏ అవకాశాన్ని కూడా అటు కెసిఆర్, ఇటు కేటీఆర్, హరీష్ రావు వదులుకోవడం లేదు.
కానీ ఇదే సమయంలో మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా వినిపించిన భారతీయ జనతా పార్టీ సోయిలో కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఇంకా కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలు తప్ప.. స్థానిక నాయకత్వం పెద్దగా ప్రచారం చేయడం లేదు. మొదటి జాబితాలో టికెట్లు దక్కించుకున్న వారు సైతం కూడా అంతంతమాత్రంగానే జనాల్లో కనిపిస్తున్నారు. బిజెపి ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కూడా పెద్దగా జనంలో కనిపించడం లేదు. మొన్నటిదాకా మహాశక్తి ఆలయంలోనే ఉన్నారు. కరీంనగర్ నుంచి ఆయన పేరు వినిపించగానే పెద్దగా ప్రతిస్పందన కూడా లేదు. ఆయన సూచించిన వారికి అధిష్టానం టికెట్లు ఇవ్వకపోవడంతో నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా బండి సంజయ్ ని ఇంకా తొక్కేందుకు ఓ వర్గం బిజెపిలో గట్టిగా ప్రయత్నం చేస్తునట్టు సమాచారం. అటు కిషన్ రెడ్డి కూడా అంత బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. శనివారం అమిత్ షా సభ సూర్యాపేటలో ఉండడంతో ఆయన ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మిగతా పెద్దపెద్ద నాయకులు కూడా ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి ప్రచారంలో దూకుడు కొనసాగిస్తుండగా.. బిజెపి మాత్రం మౌనాన్ని పాటిస్తోంది. మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం అని ప్రజలు భావించిన పార్టీ.. ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయిందంటే అది నిజంగా స్వయంకృతాపరాధమే.