TDP Janasena Alliance: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరింది. కానీ జనసేనకు మిత్రపక్షమైన బిజెపి పాత్ర ఏమిటి అనేది తెలియడం లేదు. టిడిపి, జనసేనతో బిజెపి చేరుతుందా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అటు బిజెపి చేరిక విషయంలో తెలుగుదేశం పార్టీలో ఇంకో రకమైన చర్చ కొనసాగుతోంది. మొన్నటి వరకు బిజెపి కలిసి రావాలనుకున్న టిడిపి శ్రేణులు… మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపితో పొత్తు వద్దని కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తో పాటు ఎలక్షన్ క్యాంపెయిన్ లో బిజెపి అవసరం అనివార్యమని టిడిపి నాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు టిడిపిని ఎన్డీఏలో చేర్చడమో.. లేకుంటే బిజెపిని టిడిపి, జనసేన కూటమిలో చేర్చడమో.. ఇలా ఏదో ఒకటి చేయాలని పవన్ భావిస్తున్నారు. అయితే ఇంతవరకు దీనిపై క్లారిటీ రావడం లేదు.
టిడిపి, జనసేన కూటమిలో దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత జైలుకెళ్లి పవన్ పరామర్శించారు. అటు నుంచి వచ్చిన వెంటనే పొత్తు ప్రకటన చేశారు. తక్షణం రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే జనసేన తరఫున సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సైతం కమిటీని ఏర్పాటు చేసింది. రెండు జాయింట్ యాక్షన్ కమిటీల భేటీ ఇటీవల రాజమండ్రిలో జరిగింది. పవన్ తో పాటు లోకేష్ హాజరయ్యారు. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఇంతలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు అన్ని జిల్లాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేత అమిత్ షా తో పవన్ సమావేశమయ్యారు. తెలంగాణతో పాటు ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో పొత్తులపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు అరెస్ట్, ఏపీలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పవన్ చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం బిజెపి ప్రత్యేక ప్రకటన చేస్తుందని ఆశించారు. కానీ మూడు రోజులు గడుస్తున్నా దీనిపై ప్రకటన లేదు. దీంతో బిజెపి ఏపీ విషయంలో వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారని.. తెలంగాణ ఎన్నికల అనంతరం.. అక్కడ వచ్చే ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటారని మరో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికైతే ఏపీలో టిడిపి, జనసేన పొత్తుతో ముందుకెళ్తాయని.. మధ్యలో బిజెపి వస్తే కలుపుతారని టాక్ నడుస్తోంది.
కాగా ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు తెలుగుదేశం, జనసేన సంయుక్త సమావేశాలు జరగనున్నాయి. రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం పెంచడానికి జిల్లాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా జరిగే ఈ భేటీలకు ఒక్కో పార్టీ నుంచి 50 మందిని పిలవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలను ఆహ్వానించనున్నారు. ఈ సమావేశాలకు రెండు పార్టీలకు చెందిన రాష్ట్రస్థాయి పరిశీలకులు హాజరు కానున్నారు.