Telangana Elections 2023: బీజేపీ భయమే వెంటాడుతోంది?

వాస్తవంగా గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, మహా కూటమి మధ్య పోటీ జరిగింది. బీజేపీ 119 స్థానాల్లో అభ్యర్థులను నిలిపినా, టీడీపీ తెలంగాణలో పోటీ చేయడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు.

Written By: Raj Shekar, Updated On : November 30, 2023 12:21 pm

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఈసారి ఓటరు నాడి ఎవరికీ అంతుచిక్కలేదు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు టెన్షన పడుతున్నారు. వారం క్రితం వరకు ద్విముఖ పోరుగా ఉన్న ఎన్నికల సమరం.. ఒక్కసారిగా త్రిముఖపోరుగా మారిపోయింది. బీజేపీ అనూహ్యంగా పుజుకోవడం, ఇటు అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

గత ఎన్నికల్లో 6 శాతమే..
వాస్తవంగా గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. బీఆర్‌ఎస్, మహా కూటమి మధ్య పోటీ జరిగింది. బీజేపీ 119 స్థానాల్లో అభ్యర్థులను నిలిపినా, టీడీపీ తెలంగాణలో పోటీ చేయడంపై బీఆర్‌ఎస్‌ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు కూడా బీఆర్‌ఎస్‌కు మళ్లింది. దీంతో బీజేపీకి కేవలం 6 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. 100 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయింది. కానీ ఆరు నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 27 శాతం ఓట్లు సాధించడంతోపాటు, 4 ఎంపీ స్థానాల్లో గెలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గడానికి టీడీపీ కారణంగా తేలింది.

ఈసారి పుంజుకున్న బీజేపీ..
కానీ, ఈసారి బీజేపీ బాగా పుంజుకుంది. ఆరు నెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్యనే పోలీ నెలకొంది. ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హుజూరాబాద్, నాగాజ్జున సాగర్, మునుగోడు ఎన్నికల్లో భారీగా ఓట్లు పెంచుకుంది. ఇక, కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలబడినట్లు కనిపించింది. కానీ, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారైంది. అదే సమయంలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడం కూడా బీజేపీ గ్రాఫ్‌ పడిపోవడానికి కారణమైంది. ఇలా క్రమంగా బీజేపీ అనుకూల పరిస్థితులు తగ్గుతూ రాగా, కాంగ్రెస్‌ పుంజుకుంది. ఈ ఎన్నికలు ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ కనిపించింది. కానీ ఎన్నికల ప్రచారం ముగింపునకు వారం క్రితం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి జాతీయ నేతల వరకు అంతా రంగంలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ పుంజుకుంది.

ఎవరి ఓట్లు చీలుస్తుందో..
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బీజేపీ ఎవరి ఓట్లు చీలుస్తుందో అన్న టెన్షన్‌ ఇటు బీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్‌ను పట్టుకుంది. ద్విముఖ పోరు అయితే తమకే మేలు జరుగుతుందని కాంగ్రెస్‌ లెక్కలు వేసుకుంది. ఇక విజయం ఖాయమని భావించింది. కానీ బీజేపీ జోరు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుందేమో అని ఆందోళన నెలకొంది. ఇక బీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ ఎవరి ఓటు చీలుస్తుందో అర్థం కాక తలలు పట్టుకుంటోంది. మొదట వ్యతిరేక ఓటు చీలితే తమకు లబ్ధి కలుగుతుందని భావించారు. కానీ, బీజేపీ పోల్‌ మేనేజ్‌మెంట్, సోషల్‌ ఇంజినీరింగ్‌ చూస్తుంటే.. ఇటు బీఆర్‌ఎస్‌లో కూడా ఆందోళన మొదలైంది.

గెలుసుపై బీజేపీ ధీమా..
ఇక ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ నాయకులు అంటున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ప్రచారంలో బీజేపీ తెలంగాణలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అని ప్రకటించారు. బీసీ ముఖ్యమంత్రి అవుతారని, ఎస్సీ వర్గీకరణ చేస్తామని, అవినీతిపరులను జైలుకు పంపుతామని, అవినీతి సర్కార్‌పై విచారణ జరుపుతామని వెల్లడించారు. ఇలా బీజేపీ నేతల్లో ఆత్మవిశ్వాసం నెలకొనగా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల్లో మాత్రం టెన్షన్‌ కనిపిస్తోంది.