Bandla Krishnamohan Reddy : కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే.. సొంత గూటికి.. అధికార పార్టీనే కాదన్న ఈ నేత కథ

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో జూలై మొదటి వారంలో చేరిన బీఆర్‌ఎస్‌ గద్వాల ఎమ్మెల్యే.. తాజాగా అధికార పార్టీకే షాక్‌ ఇచ్చాడు. నెల రోజులు కూడా గడవక ముందే.. తిరిగి సొంత గూటికి చేరారు.

Written By: Raj Shekar, Updated On : July 30, 2024 1:59 pm
Follow us on

Bandla Krishnamohan Reddy :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విజయం సాధించగా, బీఆర్‌ఎస్‌కు 39 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పయింది. దీంతో టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేశారు. 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే నెల రోజులకే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని బెదిరింపులకు దిగారు, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ నెల రోజులకే ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అయితే.. త్వరలోనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని సంచలన ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్‌ ఎదురుదాడితో మేల్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టారు. దీంతో దానం నాగేందర్‌తో కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. తద్వారా రేవంత్‌ బీఆర్‌ఎస్‌ను గట్టిదెబ్బ కొట్టారు. పదేళ్లు వలసలను ప్రోత్సహించిన బీఆర్‌ఎస్‌ నేతలకు అది తప్పని విమర్శిండం మినహా.. ఏమీ చేయలేని పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల తర్వాత చేరికలు మరింత ఊపందుకున్నాయి. ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక జూలై నెలలో గద్వారా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే నెల తిరగకుండానే ఆయన అధికార కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చారు. తిరిగి సొంత గూటికి చేరారు.

కేటీఆర్‌తో సమావేశం..
జూలై 5న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. తిరిగి సొంత పార్టీ బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం(జూలై 30న) ఉదయం అసెంబ్లీ ఎల్‌వోసీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ భేటీలో కృష్ణమోమన్‌రెడ్డి.. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పినట్లు తెలిసింది. సాయంత్రం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం.

చేరికను వ్యతిరేకించిన సరిత తిరుపతయ్య..
ఇదిలా ఉంటే కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికను ఆయనపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరిత తిరుపతయ్య వ్యతిరేకించారు. గతంలో ఇద్దరూ కలిసి బీఆర్‌ఎస్‌లో కలిసే పనిచేశారు. సరిత తిరుపతయ్య జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. జూలై 30తో జెడ్పీ పదవీకాలం ముగియడంతో కృష్ణమోహన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సరిత తిరుపతయ్యకు నచ్చజెప్పి కృష్ణమోహన్‌రెడ్డిని చేర్చుకున్నారు. కానీ నెల తిరిగేలోపే ఆయన యూటర్న్‌ తీసుకున్నారు.

కలిసిరాని క్యాడర్‌..
ఇదిలా ఉంటే.. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా ఆయన వెంట బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కాగ్రెస్‌లో చేరలేదు. మరోవైపు కాంగ్రెస్‌ క్యాడర్‌ కూడా కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికార పార్టీలో ఇమడలేకపోయిన ఆయన తిరిగి సొంతగూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తాను కాంగ్రెస్‌లో చేరలేదని కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొంటున్నారు. రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడు తాను కండువా కప్పుకోలేదని చెబుతున్నారు. తాను బీఆర్‌ఎస్‌ సభ్యుడినే అని లాజిక్‌ చెబుతున్నారు.