https://oktelugu.com/

Crime News : మలి వయసులో తోడూనీడగా ఉండాల్సిన ఓ భర్త రాక్షసత్వం.. విచక్షణ కోల్పోయి భార్యను..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన దూస రాజేశం (54), లక్ష్మి (50) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. పెద్ద కుమారుడి వివాహం గతంలోనే జరిగింది. ఇటీవల కుమార్తెకు కూడా పెళ్లి చేశారు. దగ్గరి బంధువులతోనే రాజేశం వియ్యం అందుకున్నారు. రాజేశం తనకు వంశపారంపర్యంగా వచ్చిన పవర్ లూమ్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 30, 2024 2:17 pm
    Follow us on

    Crime News :  అతని వయసు 54.. ఆమె వయసు 50.. వారికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడికి, కుమార్తెకు పెళ్లిళ్లు చేశారు. దగ్గరి బంధువుల సంబంధాలకే ఇచ్చారు. ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు లేవు. పైగా వారికి వంశపారంపర్యంగా వచ్చిన పవర్ లూమ్స్ ఉన్నాయి. ఆ ఇంటి పెద్ద కుమారుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు కూడా తన స్థాయికి తగ్గట్టు కొలువు చేస్తోంది. చిన్న కుమారుడు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతడు కూడా రేపో మాపో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అనుకోని ఘటన ఆ ఇంటిని శోకంలో ముంచింది. ఇంటి పెద్ద చేసిన ఘాతుకం నివ్వెర పరుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన దూస రాజేశం (54), లక్ష్మి (50) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. పెద్ద కుమారుడి వివాహం గతంలోనే జరిగింది. ఇటీవల కుమార్తెకు కూడా పెళ్లి చేశారు. దగ్గరి బంధువులతోనే రాజేశం వియ్యం అందుకున్నారు. రాజేశం తనకు వంశపారంపర్యంగా వచ్చిన పవర్ లూమ్స్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, అతని భార్య కూడా ఓ ప్రైవేట్ సంస్థలో కొలువు చేస్తోంది. ఈ క్రమంలో రాజేశం అనారోగ్యానికి గురికాగా.. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. ఆ ఆస్పత్రి వైద్యులు పరీక్షల నిర్వహించగా అతని రెండు మూత్రపిండాలు పాడయ్యాయని తేలింది. నూతన మూత్రపిండం అమర్చడమే పరిష్కార మార్గమని వైద్యులు చెప్పడంతో.. అప్పటినుంచి రాజేశం కుటుంబ సభ్యులు అదే అన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో రాజేశం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాడు.
    మూత్రపిండాల మార్పిడికి సంబంధించి రాజేశం, ఆయన కుటుంబ సభ్యుల మధ్య తరచూ చర్చ జరుగుతోంది. తాను ఈ డయాసిస్ చేయించుకోలేనని.. త్వరగా మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స జరిపే మార్గం చూడాలని రాజేశం తన పెద్ద కుమారుడిని కోరాడు. దాత కోసం ఎదురుచూస్తున్నాం, ఇంకా కొంచెం సమయం పడుతుందని అతడు పలుమార్లు బదులిచ్చాడు. ఆ సమాధానం రాజేషానికి ఎందుకో నచ్చలేదు. పైగా భార్య కూడా కుమారుడు చెప్పిన మాటే పదేపదే అంటుండడంతో రాజేషానికి కోపం తెప్పించేది. ఈ క్రమంలో ఆదివారం పెద్ద కుమారుడు, కోడలు ఓ శుభకార్యానికి వెళ్లారు. ఇదే సమయంలో రాజేశం తన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ప్రస్తావన భార్య లక్ష్మీ ఎదుట తీసుకొచ్చాడు.. దానికి ఆమె తన పెద్ద కుమారుడు చెప్పిన మాటనే మరోసారి వ్యక్తం చేసింది. దీంతో తీవ్రమైన కోపంతో రగిలిపోయిన రాజేశం.. ఇంట్లో ఉన్న ఇనుప రాడ్ తో లక్ష్మి ముఖం మీద పలుమార్లు కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భార్యను హతమార్చాననే భయమో లేక పోలీసులు తనను అరెస్టు చేస్తారని ఆందోళనో తెలియదు గాని.. రాజేశం తన ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని చనిపోయాడు. పెద్ద కుమారుడు, పెద్ద కోడలు శుభకార్యానికి హాజరై ఇంటికి తిరిగి రాగా అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు. రక్తపు మడుగులో తల్లి, ఉరి వేసుకున్న తండ్రిని చూసి పెద్ద కుమారుడు దిక్కులు పిక్కటిల్లే విధంగా ఏడ్చాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రాజేశం, లక్ష్మి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సిరిసిల్ల లో సంచలనం నెలకొంది.
    మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేకే రాజేశం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు అంటున్నారు.. క్షణికావేశంలో లక్ష్మీని హతమార్చాడని, ఆ అపరాధ భావం తో తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.. సోమవారం రాజేశం, లక్ష్మి మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.