Bandi Sanjay : ఆ దిగ్భ్రాంతి నుంచి ఇంకా బయటపడని బండి సంజయ్

అసలు అసెంబ్లీకే పోటీ చేయబోనని అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ సమక్షంలో చెప్పాను. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో పనిచేస్తానని చెప్పాను" అని బండి సంజయ్ నాయకుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది.

Written By: Bhaskar, Updated On : July 20, 2023 11:00 am
Follow us on

Bandi Sanjay : తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి తొలగించిన నాటి నుంచి బండి సంజయ్ ఇంకా నారాజ్ గానే ఉన్నారు. తనను ఎందుకు తొలగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత 15 రోజులకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కొంతమంది సీనియర్ నాయకులతో ఆయన తన ఆవేదన పంచుకున్నారు.. గురువారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులను ఆయన కలిశారు.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆయన వారి దృష్టికి తీసుకెళ్లారు. “పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ఇన్చార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, శివ ప్రకాష్ ఏనాడూ నా పని తీరు తప్పు పట్టలేదు. ఏమైనా తప్పులు చేసి ఉంటే పార్టీ బాధ్యులు నాకు చెప్పేవారు. కానీ, అలా ఏదీ జరగలేదు. నా సభలతో సహా పార్టీ కార్యక్రమాలు మొత్తం ఇన్ ఛార్జ్ లే నిర్ణయించేవారు. నేను ఏదీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. నాకంటూ సోషల్ మీడియా విభాగం కూడా లేదు. పార్టీయే దానిని నిర్వహించేది. ఇతరులకు వ్యతిరేకంగా పోస్టులు చేయాల్సిందిగా నేనెప్పుడూ ఎవరికీ చెప్పలేదు. రాష్ట్రంలో బిజెపికి 47 సీట్లు వస్తాయని రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు నివేదికల ద్వారా తెలిపాయి. నేను అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే పార్టీని గెలిపించి మోడీకి అప్పగించేవాడినని” బండి సంజయ్ సీనియర్ నాయకులతో వాపోయినట్టు తెలుస్తోంది.
తగిన పరిస్థితులు ఉన్నాయి
కర్ణాటక ఎన్నికల తర్వాత, అక్కడి ఫలితాలతో నిమిత్తం లేకుండా తెలంగాణలో బిజెపి గెలిచేందుకు తగిన పరిస్థితులు ఉన్నాయని సీనియర్ నాయకులతో బండి సంజయ్ వాపోయినట్టు తెలుస్తోంది. అంతా కలిసికట్టుగా పనిచేస్తే ఇప్పటికి గెలుపు సాధ్యమేనని బండి సంజయ్ వారి వద్ద ప్రస్తావించినట్టు సమాచారం..”నాకు గుండె జబ్బు ఉంది. అయినప్పటికీ ప్రతికూల వాతావరణం లో నేను పాదయాత్ర చేశాను. డాక్టర్లు వద్దన్నప్పటికీ పాదయాత్ర చేశాను. తొలి దశలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కాళ్లకు రక్తం కారుతున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇప్పుడు లేకుండా తిరిగాను. సంజయ్ నువ్వు వీధి పోరాటాలు చెయ్యి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అలానే వ్యవహరించారని.. నాతో ఒక సీనియర్ నాయకుడు చెప్పాడు. నేను కూడా అలాగే చేశాను. ఏనాడూ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తానని చెప్పలేదు. ఇదే విషయాన్ని బహిరంగ సభలోనూ చెప్పాను. అసలు అసెంబ్లీకే పోటీ చేయబోనని అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ సమక్షంలో చెప్పాను. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత పక్క రాష్ట్రంలో పనిచేస్తానని చెప్పాను” అని బండి సంజయ్ నాయకుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది.
ప్రోటోకాల్ ప్రకారమే ప్రకటనలు
ఇక తన పాదయాత్రకు సంబంధించి, కార్యక్రమాలకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారమే ప్రకటనలు ఇచ్చామని బండి సంజయ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రకటనల కోసం ఒక టీమ్ ఉందని, ప్రకటనల డిజైన్ కూడా వారే చేయిస్తారని సంజయ్ వెల్లడించినట్టు సమాచారం. ప్రకటనల్లోనూ అతిధుల ఫోటోల తర్వాతే తన ఫోటో వేసేవారని బండి సంజయ్ ఈ సందర్భంగా సీనియర్ నాయకుల వద్ద తెలిపినట్టు సమాచారం. ప్రకటనల కోసమే కాకుండా కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడు వారి ప్రాణాలు కాపాడేందుకు ఆసుపత్రుల బిల్లులకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేశామని, కార్యకర్తలు జైలుకు వెళ్తే న్యాయ సహాయం కోసం పార్టీ నుంచే అందించామని బండి సంజయ్ వివరించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ కింద అరెస్టు అయితే బిజెపి లీగల్ టీమే సహాయం అందించిందని ఆయన గుర్తు చేశారు. ప్రకటనల ఖర్చు గురించి మాట్లాడేవారు కార్యకర్తల కోసం పెట్టిన ఖర్చు గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేదని సంజయ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.. అధికార పార్టీకి ధీటుగా ప్రకటనలు ఇచ్చి బిజెపి అధికారంలోకి వస్తుందని సంకేతాలు ప్రజల్లో కలిగించాలన్నదే తమ ఉద్దేశమని సంజయ్ అన్నట్టు సమాచారం.
బతుకులను నాశనం చేస్తాయి
తెలంగాణలో హిందుత్వం గురించి బిజెపి మాట్లాడకపోతే..కెసిఆర్, ఎంఐఎం కలిసి హిందువుల బతుకులను నాశనం చేస్తాయని బండి సంజయ్ వారి వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. తాను పాస్పోర్ట్, మీసాలు లేని ముస్లింల గురించే మాట్లాడాను తప్ప.. సామాన్య ముస్లింల గురించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రాజెక్టుల్లో అవినీతి, ఉద్యోగులపై 371 జీవో, రహదారుల నిధుల మళ్లింపు, ఇప్పుడు భూముల గురించి మాట్లాడానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తన కారణంగా పార్టీలో చేరాలనుకునేవారు ఆగలేదని, తాను పార్టీ అధ్యక్షుడయిన తర్వాతనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజి డిజిపి కృష్ణ ప్రసాద్ వంటి వారు పార్టీలో చేరిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. బిజెపి గెలుస్తుందనే నమ్మకాన్ని కలిగించినందు వల్లే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటివారు పార్టీలో చేరిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం స్థానిక కార్యకర్తల అభిప్రాయం నిర్ణయం తీసుకుంటానని తనకు స్వయంగా చెప్పారని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ సభల్లో వేదికలపై నేతలు అందరికీ అవకాశం ఇచ్చానని, తనకు కుర్చీ లేకుండా చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని, చేసిన పనులు చెప్పుకోలేదని, అదే తన తప్పైందని బండి బాధపడినట్టు సమాచారం. బండి సంజయ్ తమ వద్ద చేసిన వ్యాఖ్యలను ఆ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.