Bandi Sanjay Comments: రాజకీయాలు ఒకప్పుడు ఒక పరిధి వరకే ఉండేవి. నాయకులు వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునేవారు కాదు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లేవారు కాదు. కేవలం విధానపరంగా మాత్రమే విమర్శలు చేసుకునేవారు. అవి కూడా సుహృద్భావ వాతావరణం లోనే కొనసాగేవి. ఫలితంగా నాటి రోజుల్లో రాజకీయాలు సుకృత రూపంలోనే సాగిపోయేవి. నేతల మధ్య వ్యక్తిగత సంబంధాలు సక్రమంగా ఉండేవి. ఎదురెదురు కనబడితే పలకరించుకునే సంస్కృతి నాయకుల్లో ఉండేది. అందువల్లే నాటి రోజుల్లో రాజకీయాలు అనేవి ఒక పరిధి వరకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు కుళ్ళు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. వ్యక్తిగత దూషణలు సర్వసాధారణంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే దాడుల వరకు రాజకీయాలు ఎదిగిపోతున్నాయి. నేతల భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
Also Read: అబ్బా.. ఎంత ప్రేమో.. ఆంధ్రజ్యోతిని నెత్తిన పెట్టుకొని తిరుగు ‘బండి’ అన్న..
తెలుగు రాష్ట్రాల్లో అయితే రాజకీయాలు మరింత వికృతంగా మారిపోయాయి. నాయకుల వ్యక్తిత్వాలను విమర్శించడం.. కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. దీనివల్ల రాజకీయాలు అంటేనే ఏవగింపు కలిగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటువంటి వాటి నిరోధానికి రాజకీయ నాయకులు చర్యలు తీసుకోకపోగా.. అభిమానులను మెప్పించుకోవడానికి.. అనుచరులను మరింత ఉద్వేగ పరచడానికి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఆ సమయంలో ఈలలు వేయించవచ్చు. చప్పట్లు కొట్టించవచ్చు. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే తీరుగా ఉంటాయి. అందువల్ల రాజకీయ నాయకులు నోటిమీద అదుపు పెట్టుకోవాలి. మాటలను అత్యంత పొదుపుగా వాడాలి.
ఇక తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఖరిదైన బట్టలు వేసుకుంటే కూడా ఓర్వడం లేదని.. ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇటువంటి రాజకీయాల వల్ల ఏం సాధిస్తారని ఆయన మండిపడ్డారు. వేసుకునే బట్టలు కూడా సక్రమంగా ఉండొద్దా..మేము బిచ్చపోల్లలెక్క తిరాగలా అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు.. అయితే బండి సంజయ్ కుమారుడిని ఇలా ట్రోల్ చేస్తున్నది భారత రాష్ట్ర సమితి నాయకులని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.
Also Read: ఏబీఎన్ ఛానల్ మీద దాడి చేస్తే, మేము తెలంగాణ భవన్‌పై దాడి చేస్తాము: బండి
బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడిని కూడా అప్పటి గులాబీ పార్టీ నాయకులు వదిలిపెట్టలేదు. ఏదో కాలేజీలో గొడవ జరిగితే బండి సంజయ్ కుమారుడు అందులో ఇన్వాల్వ్ అయితే.. అతడు రౌడీయిజం చేస్తున్నాడని గులాబీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు గులాబీ నాయకులు తమ సొంత మీడియాలో బండి సంజయ్ కుమారుడిని విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో ప్రచారం చేయించారు. ఇప్పుడిక అతడు వేసుకున్న దుస్తులు కూడా ట్రోల్ చేస్తున్నారని.. ఖరీదైన బట్టలు వేసుకుని తిరుగుతున్నాడని.. మంత్రి అయిన తర్వాత బండి సంజయ్ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఒకసారిగా మారిపోయిందని గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు బండి సంజయ్ దాకా రావడంతో ఆయన స్పందించక తప్పలేదు.. చివరికి తన కుమారుడు వేసుకున్న బట్టలను కూడా వదిలిపెట్టడం లేదని.. ఇదెక్కడి రాజకీయమని బండి సంజయ్ మండిపడ్డారు. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా హ్యాండిల్స్ గ్రూపులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. అంతేకాదు బండి సంజయ్ కుమారుడు ధరించిన దుస్తులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధరను కూడా వెల్లడిస్తున్నాయి. మరి దీనిపై బిజెపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.