Bandi Sanjay political strategy: తెలంగాణ బీజేపీలో కొన్ని రోజులుగా లుకలుకలు బయటపడుతున్నాయి. నూతన అధ్యక్షుడి ఎన్నిక సమయంలోనే ఈ విభేదాలు బయటపడ్డాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వచ్చాడు. ఆయనను ఆ పార్టీ నాయకులే అడ్డుకున్నారు. ఇక అంతకు ముందు అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. బీసీనే అధ్యక్షుడిని చేస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా రామచందర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఈటలకు పదవి రాకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల హుజూరాబాద్‌లో రాజకీయ పరిస్థితులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్లమెంటు పరిధిలో ఎక్కడా లేని సమస్య హుజూరాబాద్‌లోనే వస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు కొందరు యత్నించారని, కానీ హుజూరాబాద్‌లోనే భారీ మెజారిటీ వచ్చిందని వెల్లడించారు. దీంతో బీజేపీ నియోజయవర్గ ఇన్‌చార్జిప రాజీనామా చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే హుజూరాబాద్ ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో హుజూరాబాద్ అంటే ఈటల అన్నట్లుగా మారింది. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల ఓడిపోయారు. ఈ ఓటమికి కూడా బండి సంజయ్ కారణమని ఈటల వర్గం భావిస్తోంది.
Also Read: ఈటల – బండి ఎపిసోడ్ పై అధిష్టానం మౌనం.. ఎందుకో..?
ఈటల కూడా వార్నింగ్..
బండి సంజయ్ వ్యాఖ్యలపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా స్పందించారు. ఇటీవల తనను కలిసిన హుజూరాబాద్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన గురించి తప్పుగా మాట్లాడేవారికి, తప్పుడు ప్రచారం చేసేవారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. హుజూరాబాద్ తన అడ్డా అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతానని తెలిపారు.

బండి వర్సెస్ ఈటల.. మధ్యలో పాడి..
బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, మధ్యలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి ఎంటర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ తనకు సహకరించినట్లు వెల్లడించారు. ప్రచారం చివరి రోజుల్లో బండి సంజయ్ స్వయంగా ఫేస్‌టైం కాల్ ద్వారా చావు ఐడియా సూచించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యూహంతోనే తాను ఎన్నికల్లో విజయం సాధించానని, బండి సంజయ్ సహకారం ఈ జన్మలో మరచిపోలేనిదని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం మరోమారు తెరపైకి వచ్చింది.
బీజేపీ–బీఆర్‌ఎస్ రహస్య బంధం
పాడి కౌశిక్ వ్యాఖ్యలు బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ సహకారం ఉన్నట్లు సూచిస్తున్నాయి. 2023 హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు కేవలం 23 వేల ఓట్లు రాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కు అదే సెగ్మెంట్‌లో 73,000 ఓట్లు వచ్చాయి. ఈ గణాంకాలు బండి సంజయ్, బీఆర్‌ఎస్ మధ్య పరస్పర సహకారం ఉండి ఉండవచ్చనే అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈటల రాజేందర్ ఓటమికి బండి సంజయ్ వ్యూహాత్మకంగా సహకరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: ధూమపానం.. మాదకద్రవ్యాలు.. సంచలన వీడియో బయటపెట్టిన కేటీఆర్
బండికి ఎందుకు కోపం..
బండి సంజయ్ ఈ వ్యూహంతో బీఆర్‌ఎస్‌కు సహకరించడం వెనుక రాజకీయ లబ్ధి కోసమేనా లేక వ్యక్తిగత ప్రతీకారమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈటల రాజేందర్‌తో బండి సంజయ్‌కు ఉన్న రాజకీయ పోటీ తెలంగాణ బీజేపీలో బహిరంగ రహస్యం. ఈటల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని బండి సంజయ్ బహిరంగంగా హెచ్చరించడం ఈ విభేదాలను మరింత స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంలో బండి సంజయ్, బీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని, ఈటల ఓటమికి కారణమయ్యారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అంతర్గత సంక్షోభాన్ని బయటపెడుతున్నాయి. సొంత పార్టీ నాయకులను ఓడించేందుకు బండి సంజయ్ ఇతర పార్టీలతో సహకరించినట్లు ఆరోపణలు రావడం బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారం బీజేపీ రాష్ట్ర శాఖ ఐక్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. అదే సమయంలో, బీఆర్‌ఎస్‌తో రహస్య సంబంధాలు బీజేపీ రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.