Bathukamma sarees : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగలు బతుకమ్మ, దసరా, బోనాలు. రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే పండుగలు ఇవీ. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ కూడా కీలక పాత్ర పోషించింది. కేసీఆర్ తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మలు ఆడుతూ ఆందోళనలు చేసిన సందర్బాలు ఉన్నాయి. బోనాలు ఎత్తిన రోజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ వచ్చాక బతుకమ్మ, దసరా, బోనాల పండుగలను అధికారికంగా నిర్వహించడం ప్రారంభించారు. ఇక బతుకమ్మ అంటేనే అమ్మవారు. అమ్మవారి స్వరూపమైన ఆడ పడుచులకు బతుకమ్మ సందర్భంగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు, అదే సమయంలో బతుకమ్మ పండుగ వేళ.. ధనిక, పేద అని తేడా లేకుండా ఆడపడుచులంతా కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. రేషన్ కార్డులో పేరు ఉన్న మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. 2023 బతుకమ్మ పండుగ సంరద్భంగా కూడా చీరలు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ తర్వాత పంపిణీ ఆపేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. బతుమక్మ చీరల పంపిణీ విషయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
చీరల పంపిణీ నిలిపివేత..
ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఉచితంగా అందిస్తున్న చీలర పంపిణీ నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చీరల తయారీకి ఇప్పటి వరకు ఆర్డర్ ఇవ్వలేదు. దీంతో పంపిణీ లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ చీరల పంపిణీ పెద్ద గోల్‌మాల్ పథకమని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆరోపించారు. దీంతో బతుకమ్మ చీలర పథకం స్థానంలో మరో స్కీమ్ తీసుకురావాలని రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. అయితే బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేస్తే మహిళా లోకం నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా అని చిన్న చిన్న లీకుల ద్వారా అభిప్రాయం తెలుసుకునే పని చేస్తోంది.
నగదు లేదా బహుమతి..?
గత ప్రభుత్వం అందించిన ఈ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కేసీఆర్ కూతురు కవిత ఈ చీరలే కడుతుందా అని కూడా విమర్శించారు. కొన్ని చోట్ల చీరలను దహనం చేశారు. ఈ నేపథ్యంలో చీరల పంపిణీకి బదులుగా మరో స్కీమ్ పై అధికారులు కసరత్తు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో మహిళలకు ఏమైనా బహుమతులు ఇస్తారా? ఆర్థిక సాయం చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పండగల సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఏమైనా బహుమతులు ఇస్తున్నాయా? నగదు పంపిణీ చేస్తున్నాయా? అనే విషయాలను పరిశీలించి, బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలకు నగదు ఇస్తే ఎలా ఉంటుంది?ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి? ఆర్థిక సాయం చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది వంటి వివరాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.