Congress 6 Guarantees: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీలకు ఆస్ట్రేలియా ప్రశంసలు దక్కాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆరు గ్యారంటీలపై విమర్శలు చేస్తుంటే.. విదేశీ ప్రతినిధులు అభినందించడం గమనార్హం. ఆరు గ్యారంటీల్లో ప్రస్తుతం అమలులో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబిచ్చారు.
ఐటీ మంత్రితో భేటీ..
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సులేట్ జనరల్ హిలరీ మెక్ గెచ్చి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి చర్చించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించడానికి ఆయా కోర్సుల్లో శిక్షణ అందించడానికి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రదేశమని అంగీకరించిన గ్రీన్ రాష్ట్రానికి తమ దేశం నుంచి పెట్టుబడులు రావడానికి చొరవ చూపుతామని తెలిపారు.
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై..
ఇక రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్‌బాబు ఆస్ట్రేలియా బృందానికి వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకే ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలను మరింత లాభసాటిగా మార్చేందుకు యూనివర్సిటీలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వి హబ్‌తో ఆస్ట్రేలియా భాగస్వామ్యం..
తెలంగాణ వి హబ్‌తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ సందర్భంగా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మధ్య ఈమేకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా మహిళలు, అణగారిన వర్గాలకు ఎల్జీబీటీఐఈ సమూహానికి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌లో స్టార్ట్ – ఎక్స్ పేరిట 13 వారాలపాటు వి హబ్ ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. వి–హబ్‌తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందం సంతోషంగా ఉందన్నారు. అస్ట్రేలియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.