Mallikarjun Kharge: త్వరలో పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోణంలోనే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. హిందుత్వ కోణంలో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. రామ జన్మభూమి ప్రాంతంలో రామ మందిరాన్ని ప్రారంభించి, బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేసిన సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ఇక రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇక ఆ పార్టీ దేశంలోని కొన్ని విపక్షాల సహాయంతో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనానికి కారణమవుతున్నాయి.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే జరిగే నష్టం ఏమిటో ఆయన చేసిన సూత్రీకరణ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారు? అనే ప్రశ్నకు చాలామంది భారతీయ జనతా పార్టీ అని సమాధానం చెబుతున్నారని పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి.. ఇటీవల జన్మత్ అనే సర్వే సంస్థ క్షేత్రస్థాయిలో విషయాలను పరిశీలించి.. ఒక నివేదికను విడుదల చేసింది. ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ 300కు పైచిలుకు పార్లమెంటు స్థానాలు గెలుచుకొని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 48 స్థానాలకు పరిమితమైపోతుందని వెల్లడించింది. ఇంకా కొన్ని సంస్థలు ఇలాంటి ఫలితాలనే వెల్లడించాయి. ఇలాంటప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్లో బలం పెంచే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేశారు. విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలో ప్రకటించారు. “ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అలా అయితేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. లేకుంటే నరేంద్ర మోడీ శాశ్వత ప్రధాని అవుతారు.. అలా శాశ్వత ప్రధాని అయితే దేశంలో పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు దేశంలో ఇవే చివరి ఎన్నికలు కూడా అవుతాయి” అని మల్లికార్జున ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ప్రజాస్వామ్యపరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారత్ లో శాశ్వత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎలా ఉంటారు? అనే ప్రశ్న తలెత్తుతోంది.. ఇవే చివరి ఎన్నికలు అవుతాయి? అనే విస్మయం కూడా కలుగుతుంది..
ఉదాహరణకు రష్యాలో పుతిన్ ఎప్పటినుంచో అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ కూడా ఎన్నికలు పెడుతూనే ఉన్నారు. కాకపోతే ప్రజల అభిమానాన్ని పొందడంలో అక్కడి ప్రతిపక్ష పార్టీలు విఫలమవుతున్నాయి. పుతిన్ పై ఆరోపణలు ఉన్నప్పటికీ.. అక్కడ ప్రతిపక్ష పార్టీలు 20 శాతానికి మించి ఓట్లు సాధించలేకపోతున్నాయి. దీనివల్ల పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రష్యా దేశంలో మన దగ్గర ఉన్నంత ప్రజాస్వామ్యం ఉంటుందా? వ్యవస్థల్లో స్వేచ్ఛ ఉంటుందా? ఈ ప్రశ్నలకు దాదాపు నో అనే సమాధానమే వస్తుంది. మోడీ ఇవాళ ప్రధానమంత్రిగా ఉండవచ్చు గాక.. రేపటి నాడు ప్రజలు ఓటేస్తే గెలుస్తాడు. తిరస్కరిస్తే ఓడిపోతాడు. ఇందిరా ఈస్ ఇండియా. ఇండియా ఇస్ ఇందిరా అని నినదించి.. పాలించిన ఇందిరాగాంధీని ఈ దేశ ప్రజలు ఓడ కొట్టారు. ఇందిరా గాంధీ అవమానించిన తీరును నిరసిస్తూ తెలుగు నాట ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీ పెడితే 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పెడితే వాటికి ఎదురు తిరిగి గుజరాత్ రాష్ట్రంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు. కేంద్రంలోనూ ప్రధాన మంత్రిగా ఎన్నికై.. అది కూడా రెండుసార్లు బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించారు. అంటే మోడీ విధానాలు ప్రజలకు నచ్చుతున్నాయి కాబట్టి ఓట్లు వేస్తున్నారు. నచ్చకపోతే ఓడించి తీరుతారు. కానీ ఈ లాజిక్ అర్థం కాక మల్లికార్జున ఖర్గే ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏక వ్యక్తి పాలన ఉండదు. శాశ్వత ప్రధానమంత్రి అనే వ్యవస్థ ఉండదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమిని కాపాడుకుంటే మంచిది. ఇప్పటికే నితీష్ కుమార్ బయటికి వెళ్లిపోయాడు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకు తేజస్వీ యాదవ్ కోసం చేస్తున్న తెర వెనుక పన్నా గాన్ని గుర్తించి బయటికి వచ్చాడు. బిజెపితో మళ్ళీ స్నేహాన్ని ప్రారంభించాడు. ఇలాంటి విషయాన్ని గుర్తించలేక కాంగ్రెస్ పార్టీ ఏదో కవర్ చేస్తోంది. ఏదేదో మాట్లాడి ప్రజల్లో ఆభాసుపాలవుతున్నది. చివరికి ఆ పార్టీ అధ్యక్షుడి వ్యవహార శైలి విస్మయాన్ని కలిగిస్తున్నది. ఇలాంటి మాటలతో మోడీని ఎలా ఓడిస్తారో మల్లికార్జున ఖర్గే కే తెలియాలి.