Khammam: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మరొక్క రోజు మాత్రమే గడువు ఉంది. శనివారం సాయంత్రం తో ప్రచారం ముగుస్తుంది. ఆదివారం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన సామగ్రితో పోలింగ్ కేంద్రానికి వెళ్తుంటారు. శనివారం తర్వాత అభ్యర్థులు ప్రచారం చేసేందుకు ఉండదు..ఈ దశలో ప్రజల నాడి ఎలా ఉంది? పార్లమెంటు సభ్యులుగా ఎవరిని గెలిపించాలని భావిస్తున్నారు? అనే కోణంలో ఆత్మసాక్షి అనే సంస్థ ఒక సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి చేపట్టిన సర్వే తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ సర్వేలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి? ఎవరు పార్లమెంటు సభ్యుడిగా గెలవబోతున్నారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే..
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఎక్కువగా స్థానికేతరులు పార్లమెంటు సభ్యులుగా గెలిచారు. ఈ స్థానంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు విజయం సాధించాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, భారత రాష్ట్ర సమితి ఉన్నాయి. అయితే ఈసారి ఈ స్థానంలో కచ్చితంగా గెలవాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. ఈ స్థానంలో పాల్వంచ పట్టణానికి చెందిన తాండ్ర వినోద్ రావును పోటీలో పెట్టింది.. వాస్తవానికి ఈ సీటు నుంచి మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు పోటీ చేస్తారని భావించారు. కానీ, అనూహ్యంగా తనకున్న పరిచయాలతో తాండ్ర వినోద్ రావు టికెట్ తెచ్చుకున్నారు.. ఖమ్మం లాంటి చైతన్యవంతమైన పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత ఊపు తేగలిగారని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తాండ్ర వినోద్ గెలిచే అవకాశం ఉందని ఆత్మసాక్షి తన సర్వేలో ప్రకటించిందని తెలుస్తోంది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఖమ్మం పార్లమెంటు స్థానంలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మధిర నియోజకవర్గం నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం నుంచి విజయం సాధించిన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. పాలేరు స్థానం నుంచి గెలుపును అందుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. ముగ్గురు మంత్రులు అత్యంత కీలకంగా ఉన్న ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయని ఆత్మసాక్షి సర్వే చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమేనని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఆత్మసాక్షి సర్వేలో శాంపిల్ గా 3000 మందిని తీసుకుందట. ఆ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 36.62 శాతం ఓట్లు వస్తాయట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 36.12% ఓట్లు లభిస్తాయట. భారత రాష్ట్ర సమితికి 19.27 శాతం ఓట్లు వస్తాయట. ఇక ఇందులో బిఎస్పీకి 3.33, ఇండిపెండెంట్ కు 1.16% ఓట్లు లభిస్తాయట.. అయితే ఈ సర్వే ను భారతీయ జనతా పార్టీ నాయకులు స్వాగతిస్తున్నారు. కచ్చితంగా ఈ స్థానం గెలుచుకుంటామని చెబుతున్నారు. తన విజయం ఖరారు అయిందని, తను కేంద్ర మంత్రినయి ఖమ్మం నియోజకవర్గం రూపురేఖలు మార్చుతానని తాండ్ర వినోద్ అంటున్నారు.
మరోవైపు ఈ సర్వేను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టి పారేస్తున్నారు. ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో.. ఓ మంత్రి వియ్యంకుడు పోటీ చేస్తున్న స్థానంలో.. బిజెపి ఎలా గెలుస్తుందని అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సరైన కార్యవర్గం లేదని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉందని.. పైగా రఘురామిరెడ్డికి యువత లో విపరీతమైన క్రేజ్ ఉందని.. అలాంటప్పుడు బిజెపి గెలుస్తుందని ఎలా చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు సర్వసాధారణమే. అంతిమంగా ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఎవరు విజేత అనేది జూన్ 4 దాకా గాని తెలియదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Atmasakshi survey bjp wins in khammam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com