Jubilee Hills By Election: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) విచిత్ర రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. ఎవరికి ఎవరు మిత్రుడో.. ఎవరు శత్రువో తెలియడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విరుద్ధ ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏపీలో టీడీపీ కూటమి పాలన సాగిస్తోంది. టిడిపి కూటమిలో బిజెపి ఉంది. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ లో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ తో పాటు బిజెపికి బద్ధ శత్రువు కాంగ్రెస్. ఈ లెక్కన రెండు ప్రభుత్వాలు రాజకీయంగా విరుద్ధంగా ఏర్పడినవి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం భిన్న స్థితిలో ఉన్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినా.. ప్రతిపక్ష పార్టీల్లో అతిపెద్దది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఉన్న కేసీఆర్ పార్టీతో వైసీపీకి మైత్రి ఉంది. ఇటువంటి సందిగ్ధ రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది.
* ఒకరికొకరు సహకారం..
తెలంగాణలో( Telangana) జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టు పరిస్థితి ఉంది. మరో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. దీంతో టీడీపీతో పాటు జనసేన పరిస్థితి ఏంటి అన్నది తెలియడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే బీఆర్ఎస్ కు మద్దతు గా నిలవడమే కాదు ప్రచారం కూడా చేస్తోంది. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన నాటి నుంచి కెసిఆర్ తో స్నేహం కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరూ క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. అందుకే ఒకరికొకరు సహకరించుకోవడమే తప్ప మరో పరిస్థితి ఉండదు.
* చంద్రబాబు సన్నిహిత నేతగా
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2023 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం సైలెంట్ కావడంతోనే కాంగ్రెస్ గెలిచిందన్న ఒక వాదన ఉంది. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నారు. బిజెపితో మైత్రి కుదరలేదు. అటు బిజెపి సైతం టిడిపి సహకారం కోరలేదు. తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అనుసరించింది. చంద్రబాబు పట్ల రేవంత్ చూపే అభిమానం.. ఆ పై రేవంత్ తెలంగాణ సీఎం అవుతాడని భావించిన టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రేవంత్ విజయం సాధించిన తరువాత కూడా చంద్రబాబు పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య కొనసాగుతూనే.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఎవరికి వారు పట్టుపడుతూ వచ్చారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతుండడంతో టిడిపి మద్దతు ఎవరికీ అనే వాదన వినిపిస్తోంది.
* సెటిలర్స్ అధికం..
జూబ్లీహిల్స్ లో( Jubilee Hills ) సెటిలర్స్ అధికం. ఆపై కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఉంటుంది. అదే సమయంలో ఏపీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం సైతం ఉంది. ఎప్పటికీ వైసీపీ స్టాండ్ అదే. తెలంగాణలో బిఆర్ఎస్ గెలిస్తే.. ఆ పార్టీకి జవసత్వాలు వస్తాయి. అది ఏపీ పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వైసిపి కెసిఆర్ పార్టీకి మద్దతు తెలుపుతోంది. సహజంగానే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన వైసీపీని వ్యతిరేకిస్తాయి. జూబ్లీహిల్స్ లో ఉన్న సెటిలర్స్ టిడిపి తో పాటు జనసేన ను అభిమానిస్తే వారంతా కాంగ్రెస్ వైపు టర్న్ అవుతారు. వైసీపీని అభిమానించిన వారు కెసిఆర్ పార్టీ వైపు వెళ్తారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏపీ పార్టీలే కీలకం అన్నమాట.