Andhra Jyothi: ఉదయం ఈనాడు పేపర్ తిరిగేస్తుంటే జర్నలిజం స్కూల్లో నోటిఫికేషన్ కనిపించింది. అందులో చాలా స్పష్టంగా కేవలం మల్టీమీడియా, వెబ్, మొబైల్ జర్నలిజం లో మాత్రమే శిక్షణ ఇస్తామని ఈనాడు పేర్కొంది. మొదటి ఆరు నెలలు 14,000, ఆ తర్వాత 15,000, అనంతరం 19,000, తదుపరి ప్రొబెషన్ 21,000, కన్ఫర్మేషన్ లో 23,000 వరకు జీతభత్యాలు చెల్లిస్తామని ఈనాడు పేర్కొంది. ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలో కేవలం టీవీ, మొబైల్, మల్టీమీడియాలో శిక్షణ ఇస్తామని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రింట్ మీడియా ఖర్చులు పెరిగిపోవడం.. పేపర్, రంగులు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాలు యాజమాన్యాలకు తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటికే ఈనాడు పేజీలను కుదించింది. సంపాదకీయం పేజీలోకి అంతర్యామి, హాయ్ బుజ్జి వంటి వాటిని తీసుకొచ్చింది. సంపాదకీయం పేజీని కూడా పూర్తిగా మార్చేసింది. ఇక జాతీయ వార్తల పేజీని సగానికి తగ్గించింది. భవిష్యత్తు కాలంలో ఇంకా కుదింపులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల కాలం వరకు పేపర్ సాగుతుందని.. ఆ తర్వాత వెబ్ ఎడిషన్ కి మారిపోతుందని అంటున్నారు.
ఇబ్బంది లేకపోయినప్పటికీ..
రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈనాడుకు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు.. ఒకవేళ ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ గనక అధికారంలోకి వచ్చి ఉంటే ఈనాడు ప్రింట్ మీడియాకు స్వస్తి పలికేదనే ఆరోపణలు లేకపోలేదు. వాస్తవానికి అప్పట్లోనే ఈనాడు ప్రింట్ బాధ్యతను ఓ సంస్థకు అప్పగించేందుకు చర్చలు జరిగాయని.. తుది దశకు చేరుకునే సరికి ఆగిపోయాయని ప్రచారం జరిగింది. యాడ్స్ రెవిన్యూ తగ్గిపోవడం.. కార్డు రేట్ల కంటే తక్కువకు యాడ్స్ ప్రచురించడం.. ఇన్ని చేసినప్పటికీ ఈనాడు పై ప్రింట్ భారం నానాటికీ పెరిగిపోతోందని అంటున్నారు. అందువల్లే దశలవారీగా ప్రింట్ భారాన్ని తగ్గించుకోవడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అందువల్లే జర్నలిజం నోటిఫికేషన్ లో ప్రింట్ మీడియా ప్రస్తావన తీసుకురాలేదట.
రాధాకృష్ణకు అర్థం కావడం లేదు
ఇటీవల రామోజీరావు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మీడియా మొగల్ గా, చిరస్థాయి వ్యక్తిగా రామోజీరావు పేరు గడించారు. అయితే ఆయన స్థానాన్ని అందుకోవాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎడిషన్ల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆంధ్రలో సగం ఎడిషన్లలో మీటింగ్లు పూర్తయ్యాయి. మిగతా ఎడిషన్ లతోపాటు.. తెలంగాణలోనూ ఆయన పర్యటించనున్నారు. ఇదే సమయంలో పేజీల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్లో ఒక బ్యాచ్ కొనసాగుతోంది. మరో మూడు నెలల్లో వారి శిక్షణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత వారు ఎడిషన్లకు వెళ్తారు. ప్రింట్ మీడియా అనేది కొడిగట్టిన దీపం లాగా మారిన ప్రస్తుత కాలంలో.. పేజీల సంఖ్యను పెంచడం అనేది ఒక సాహసం. వాస్తవానికి కోవిడ్ సమయంలో నేషనల్ మీడియా సంస్థలు మొత్తం డిజిటల్ వైపు వెళ్లాయి. ప్రఖ్యాత టైమ్స్ ఆఫ్ ఇండియా పేజీల సంఖ్యను చాలా వరకు కుదించింది. కొన్ని ఎడిషన్లను ఎత్తేసింది. ది హిందూ మాత్రం పేజీల సంఖ్యను పెంచింది. పైగా పాఠకులు భౌతికంగా పేపర్ చదివి మాత్రమే సమాచారాన్ని తెలుసుకుంటారని వాదించింది. పేజీల సంఖ్యను పెంచడం వల్ల భారం పెరిగింది. పెంచిన పేజీలకు తగ్గట్టుగా యాడ్ రెవెన్యూ రాకపోవడంతో.. మళ్లీ వాటి సంఖ్యను తగ్గించి డిజిటల్ బాట పట్టింది. ప్రఖ్యాత ఈనాడు ప్రింట్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సాక్షి అదే బాటలో ఉంది. నమస్తే పేజీల సంఖ్యను తగ్గించింది. ఇక ఎర్ర పత్రికలు 6 పేజీల్లోనే వార్తలను ప్రచురిస్తున్నాయి. కానీ ఆంధ్రజ్యోతి పేజీల సంఖ్యను పెంచుతామని నిర్ణయం తీసుకుంది. ఈనాడు ప్రకటనతోనైనా రాధాకృష్ణ మారతారా.. లేకుంటే సాహసం చేసి విజయం సాధిస్తారా?!