Ande Sri life story : పేద కుటుంబం.. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తినడానికి తిండి ఉండేది కాదు. అలాంటి కుటుంబంలో పుట్టిన అతడు చిన్నప్పుడే వారి ఊర్లో ఉన్న మోతుబరి రైతు వద్ద పశువుల కాపరిగా చేరాడు. పశువులను కాస్తూనే పాటలు పాడేవాడు. ప్రకృతిని దగ్గరగా చూస్తూ కవిత్వాన్ని అల్లుకునేవాడు.. ప్రజా సమస్యలపై పాటలు పాడేవాడు. మనిషి జీవితం గురించి ఆయన రాసిన పాటలు ఎంతో పేరు సంపాదించి పెట్టాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం లేబర్తి గ్రామంలో అందెశ్రీ 1961 జూలై 18న జన్మించారు. అందెశ్రీ అసలు పేరు అంజయ్య.. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. పేద కుటుంబం కావడంతో ఆ ఊరి మోతుబరి రైతు పశువులను కాసేవాడు. చిన్నప్పటినుంచే అందెశ్రీలో ప్రశ్నించే స్వభావం అధికంగా ఉండేది. అదే ఆయనను కవిగా మార్చింది.. ఆశువుగా కవితలు చెప్పేవాడు.. అప్పటికప్పుడు పాటలు రూపొందించేవాడు.. ఆయన రూపొందించిన పాటలలో “మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు” విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నో పాటలను.. ఎన్నో కవితలను ఆయన రూపొందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయ జయహే జయహే తెలంగాణ అనే పాట విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది.. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ప్రతి చోట ఈ పాట వినిపించేది. ఆ పాటకు ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ దానిని అధికారిక గేయంగా గుర్తించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందెశ్రీని దూరం పెట్టారు.
ప్రజా సాహిత్యాన్ని ప్రజలకు అందించడంలో అందెశ్రీ కీలకపాత్ర పోషించారు.. ప్రకృతి కవిగా పేరు తెచ్చుకున్నారు.. స్వరాష్ట్ర సాధన, జాతిని జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.. 2022లో అందెశ్రీకి జానకమ్మ పురస్కారం లభించింది.. 2006లో గంగా అనే సినిమాకు రాసిన పాటకు నంది పురస్కారాన్ని అందుకున్నారు.. ఇటీవల లోక్ నాయక్ అవార్డు అందుకున్నారు. 2024 లో దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది.. చదువు లేకపోయినప్పటికీ.. ధిక్కార స్వభావం ద్వారా ఆయన కవిగా మారారు. తన పాటలతో.. తన గేయాలతో విశేషమైన పేరు తెచ్చుకున్నారు.