CM Revanth Reddy: హనుమాన్ సినిమా పరిమిత బడ్జెట్లో రూపొందింది.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కనక వర్షం కురిపించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇతర చిత్ర పరిశ్రమల్లో అదరగొట్టింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి 450 శాతం లాభాలను అందించింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, ఇతర గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆది పురుష్, ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, కల్కి, పుష్ప -2 సినిమాల కంటే హనుమాన్ సినిమాలో గ్రాఫిక్స్ బాగుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గ్రాఫిక్స్ కంటే, సహజ సిద్ధంగా చూస్తున్న దృశ్యాలు గానే అవి కనిపించాయని పేర్కొన్నారు. అత్యంత నాసిరకమైన గ్రాఫిక్స్ దృశ్యాలు రూపొందించిన ఆ సినిమాలకు బడ్జెట్ వందల కోట్లు ఉండడం విశేషం. అయితే ఇక్కడ గ్రాఫిక్స్, చిత్ర నిర్మాణానికి అంతగా అంతగా ఖర్చు కాదని తెలిసిన మాటే. ఇక్కడ సినీ నటుల పారితోషికాలే చుక్కలనంటుతాయి. ఉదాహరణకు పుష్ -2 సినిమాకు అల్లు అర్జున్ 300 కోట్ల దాకా తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఈ ఏడాదికి అల్లు అర్జున్ నిలిచారని కథనాలు వినిపించాయి. ఒక హీరో 300 కోట్ల దాకా తీసుకున్నప్పుడు ఆ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోవడం లో ఆశ్చర్యం లేదని సినిమా విశ్లేషకులు అంటున్నారు. “సినిమా బడ్జెట్ పెరిగిపోవడం వల్లే నిర్మాతలు బెనిఫిట్ షోలు, టికెట్ రేటు పెంపు వంటి వాటి మీద ఆధారపడతారు. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకుంటారు. వారం రోజులపాటు ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తారు. వినోదం కోసం సినిమా థియేటర్ కు వెళ్లిన వారికి చుక్కలు చూపిస్తారు. అందువల్లే తెలుగు చిత్ర పరిశ్రమ ఇలా మారిపోయిందని” సినీ విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యమంత్రికి తెలిసింది
పుష్ప -2 సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించామని చిత్ర నిర్మాతలు పేర్కొనడంతో.. బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చింది. అందువల్లే ఇకపై బెనిఫిట్ షో లు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించడం చిత్ర నిర్మాతలకు, శని పెద్దలకు ఇబ్బంది కలిగించింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అంతేకాదు సినీ నిర్మాతల భారీ బడ్జెట్ లెక్కలు తెలుసు కాబట్టే.. బెనిఫిట్ షో లను రద్దు చేసి పడేశారు. అంతేకాదు టికెట్ల ధరల పెంపు కూడా ఉండదని ప్రకటించారు. గురువారం జరిగిన సమావేశంలోనూ అదే నిర్ణయాన్ని మరోసారి తెలుగు సినీ పెద్దల ఎదుట మరోసారి ప్రస్తావించారు. దీంతో తెలుగు నిర్మాతలకు షాక్ తగిలింది. హనుమాన్ చిత్ర బడ్జెట్ 6 కోట్ల లోపే.. క సినిమా బడ్జెట్ కూడా మూడు కోట్లలోపే. అయినా వాటిల్లో గ్రాఫిక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. నిజంగా తీశారా అనిపిస్తాయి. కానీ అదే భారీ సినిమాల్లో గ్రాఫిక్ దృశ్యాలు.. గ్రాఫిక్స్ గానే కనిపిస్తాయి. అంటే బడ్జెట్ ఎక్కడ పెరుగుతుందో సినీ పెద్దలు ఆలోచించుకోవాలి. అక్కడే కత్తెర వేస్తే తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరిని దేబిరించాల్సిన అవసరం ఉండదు. వందల కోట్ల పారితోషికం వసూలు చేసే హీరోలకు ఇది పడుతుందా? రేవంత్ ఇచ్చిన స్ట్రోక్ తో వారికి జ్ఞానోదయం కలుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.