Ponnam Prabhakar: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది. ఈ రెండు నెలల్లో సమష్టిగా పాలన సాగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఏ నిర్ణయం తీసుకున్నా మంత్రులతో చర్చించాకే ఫైనల్ చేస్తున్నారు. ఎక్కడా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే అధికారం కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైన బీఆర్‌ఎస్ మాత్రం ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. అధికార కాంగ్రెస్‌తోపాటు ఓటర్లను తప్పు పడుతోంది. కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెగ బాధపడిపోతున్నారు. ప్రజాతీర్పును గౌరవించడం లేదు. ఓటమిని అంగీకరించడం లేదు. కాంగ్రెస్ తప్పుడు హామీలే తమను స్వల్ప తేడాతో ఓడించాయని బావ, బామ్మర్దులు హరీశ్‌రావు, కేటీఆర్ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలుకు సమయం ఉన్నా.. ఇంకా ఎప్పుడు చేస్తారని నిలదీస్తున్నారు.
తిప్పి కొడుతున్న మంత్రులు..
బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. కేటీఆర్, హరీశ్‌రావుల ప్రశ్నలకు దీటుగా సమాధానం చెబుతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. మాటకు మాట సమాధానం చెబుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి కూడా సమయం చూసి బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎత్తి చూపుతున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను వివరిస్తున్నారు.
‘పొన్నం’ దూకుడు..
అందరూ ఒకలెక్క.. నేను ఒక లెక్క అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్‌ను కేటీఆర్, హరీశ్‌రావు పల్లెత్తు మాట అన్నా సహించడం లేదు. వ్యక్తిగతంగా బావ, బామ్మర్దులను టార్గెట్ చేస్తున్నారు. డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బహుషా పొన్నం ప్రభాకర్ పెట్టినన్ని ప్రెస్‌మీట్లు ఏ మంత్రి పెట్టలేదు. ఎవరికీ భయపడేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ చేసిన అక్రమాలు, అవినీతిని తవ్వుతున్నామని ఒక్కొక్కరి బండారం త్వరలోనే బయట పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. రేవంత్ క్యాబినెట్‌లోని ఏ మంత్రి కూడా ఇంతలా బీఆర్‌ఎస్‌ను ఎటాక్ చేయడం లేదు. అసెంబ్లీలో జ్యోతిబాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్ తనయ, ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేయడాన్ని తప్పు పట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పుడు అన్నాచెల్లెలు, బావకు ప్రజలు, ప్రజానేతలు, పోరాట యోధులు గర్తొస్తున్నారని మండిపడ్డారు.
దూకుడుకు కారణం ఏంటి?
రేవంత్ కేబినెట్‌లో ఏమంత్రి మాట్లాడని విధంగా పొన్న ప్రభాకర్ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నంకు కేబినెట్‌లో ఛాన్స్ దక్కింది. దీంతో ఉత్సాహంగా ఉన్న ఆయన.. కాంగ్రెస్‌పై తన అభిమానాన్చి చాటుకుంటున్నారు. ప్రభుత్వాని, పార్టీని, మంత్రులను పల్లెత్తు మాట అన్నా సహించడం లేదు. ఇంత డేరింగ్ వెనుక ఓ కారణంగా కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. పొన్నం విద్యార్థి సంఘం నేత నుంచి ఎదిగారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన తొలిసారే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతోపాటు తెలంగాణ బిల్లు ఆమోదంలో ఓటువేసే ఛాన్స్ దక్కింది. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడికి గురై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌కు వీర విధేయుడిగా మారారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రిగా ఛాన్స్ వచ్చింది. దీంతో తల్లిలాంటి పార్టీపై ఈగ వాలనివ్వడం లేదు. మరో విషయం ఏంటంటే.. పొన్నం ప్రభాకర్‌కు ఇతర మంత్రుల్లా వ్యాపారాలు లేవు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం కోల్పోయినప్పుడు మరోలా మాట్లాడడం లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్, హరీశ్ పల్లెత్తు మాటన్నా సహించడం లేదు.
కేటీఆర్ బట్టలూడదిస్తాం..
ఇదిలా ఉండగా, కరీంనగర్‌లో టీఎన్జీవో ఉద్యోగుల ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని పొన్నం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. ఉద్యోగుల సమస్యలు తనకు తెలుసని పేర్కొన్నారు. తనకు వ్యాపారాలు లేవని ప్రజల కోసం పనిచేస్తానన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల బట్టలు ఊడదిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేటీఆర్ బట్టలు ఊడదీసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. తాను కేటీఆర్‌లా అమెరికా నుంచి రాలేది, ప్రజల నుంచి వచ్చానన్నారు. కష్టపడి గెలిచానని తెలిపారు.