HomeతెలంగాణLok Sabha Elections: లోక్‌సభ సమర శంఖం

Lok Sabha Elections: లోక్‌సభ సమర శంఖం

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నిల సమరానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సమాయత్తం అవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్‌ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో మూడు పార్టీలు సమరానికి సమాయత్తం అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. అదే ఊపును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే రెండుసార్లు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. నామినేటెడ్‌ పదవుల ఆశచూపి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచిస్తున్నారు. కష్టపడేవారికి పదవులు వస్తాయని చెబుతున్నారు.

బరిలో వీరు..
కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈమేరకు అధిష్టానానికి కూడా అందజేశారని ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ నేతలతోపాటు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే ముగ్గురు, నలుగురి పేర్లు కూడా ఇందులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సీనియర్‌ నాయకులు జీవన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, రేణుకచౌదరి, అంజన్‌కుమార్‌ యాదవ్, జానారెడ్డి, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడితోపాటు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌నేత, కూడా కాంగ్రెస్‌ నుంచి పెద్దపల్లి ఎంపీ టీకెట్‌ ఆశిస్తున్నారు. వీరితోపాటు అనేక మంది సీనియర్లు కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి టికెట్‌ ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

తెలంగాణ నుంచే బీజేపీ ప్రచారం..
ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ తెలంగాణ నుంచే మొదలు పెట్టబోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలో సభలు నిర్వహించనున్నారు. ఈమేరకు షెడ్యూల కూడా ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ నుంచి 10 స్థానాల్లో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్‌రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. సోయం బాపురావు టికెట్‌పై అనుమానాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. దీంతో అక్కడ కొత్త అభ్యర్థిని బరిలో దించే అవకాశం ఉంది. ఇక మహబూబ్‌నగర్‌ నుంచి డీకే.అరుణ, జితేందర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిసింది. అమిత్‌షా పర్యటన తర్వాత అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో టికెట్లు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

కరీంనగర్‌ ఆసక్తికరం..
ఇక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతల దృష్టి మొత్తం కరీంనగర్‌పైనే ఉంది. కరీనగర్‌ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. అలాగే ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఇటీవల కరీంనగర్‌లో సమావేశం నిర్వహించి సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టాలని కేడర్‌కు సూచించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యే ఉండే అవకావం ఉంది. కాంగ్రెస్‌కు ఇక్కడ సరైన అభ్యర్థి లేరు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అసెంబ్లీ ఎన్నిల్లో హుస్నాబాద్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. మంత్రి కూడా అయ్యారు. దీంతో కొత్త అభ్యర్థిని బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్‌తోపాటు, వెలిచాల జగపతిరావు కుమారుడు రాజేందర్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఇద్దరూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటుగా లేరన్న అభిప్రాయం కాంగ్రెస్‌లోనే వ్యక్తమవుతోంది. మరోవైపు జీవన్‌రెడ్డిని కూడా కరీంనగర్‌ లేదా నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో దించే అవకాశం కనిపిస్తోంది.

నిజామాబాద్‌ రసవత్తరం..
ఇక నిజాబాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు కూడా రసతవ్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పోటీ చేయడం ఖాయం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత దిగుతారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ కూతురు కవితను ఓడించి అర్వింద్‌ సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీ ప్రధాన అంశంగా మారింది. బాండ్‌ పేపర్‌ రాసి ఇచ్చిన అర్వింద్‌ కాస్త ఆలస్యంగా అయినా పసుపు బోర్డు తెచ్చారు. దీంతో ఈసారి కూడా బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కవిత నిజామాబాద్‌ కాకుండా మెదక్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉనికి కోసం బీఆర్‌ఎస్‌..
ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యం పొగెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్‌ నియోజవకర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. కానీ, బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందు చాలా మంది వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగుల్లో కూడా ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మెదక్‌ నుంచి కేసీఆర్, నిజామాబాద్‌ నుంచి కవిత పోటీ దాదాపు కాయం. పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ నుంచి పోటీకి చాలా మంది వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పూర్తిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో పోటీకి అభ్యర్థులను వెతికే పనిలో బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉంది.

రసవత్తరంగా రాజకీయం..
మొత్తంగా మూడు పార్టీల సమాయత్తంతో తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ఒకవైపు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఆధిపత్యం పెంచుకునే ప్రయత్నంలో ఉండగా, బీఆర్‌ఎస్‌ మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలన్న నినాదంతో బీజేపీ ఎన్నికలను ఎదుర్కొనే అవకాశంది. కాంగ్రెస్‌ రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని, మత రాజకీయాలను ఓడించాలనే పిలుపుతో ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌.. తెలంగాణ గలం, బలం పేరుతో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటర్లు 19 నియోజకవర్గాల్లో ఎవరికి ఎన్ని సీట్లు కట్టబెడతారో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular