Adilabad : నేడు పెళ్లి అంటే.. 16 రోజులు జరుపుకుంటున్నారు. కానీ, నాటి పద్దతులు వేరు.. నేటి ట్రెండ్ వేరు. ఒకప్పుడు పెళ్లి అంటే బంధువులంతా వారం ముందు వచ్చి పెళ్లి తర్వాత వారం ఉండేవారు. అన్ని పనులు సమష్టిగా చేసుకునేవారు. నేడు పెళ్లి ట్రెండ్ మారింది. అనేక మార్పులు చేసుకుంటూ వచ్చిన పెళ్లి రీతులు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్(Pre Wedding), హల్దీ(Haldi), బ్యాచ్‌లర్ పార్టీ(Bachilor Party).. అంగరంగ వైభవంగా పెళ్లి, సాంకేతిక వినియోగం.. మద్యం ఏరులై పారేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో పెళ్లికి మందు నిర్వహించే ప్రీ వెడ్డింగ్, హల్దీ, బ్యాచ్‌లర్ పార్టీలు కీలకంగా మారాయి. పెళ్లికి ముందే వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో పాల్గొనడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇలాంటివి మన సంస్కృతి కాదు. ఇలాంటి కార్యక్రమాలతో విసిగిపోయిన తెలంగాణ(Telangana)లోని ఆదిలాబాద్(Adilabad) జిల్లా ఉట్నూర్ మండలం శ్యాం నాయక్ తండా ప్రీవెడ్డింగ్ షూట్స్‌తోపాటు భారీ హంగామాతో పెళ్లిళ్లు పరిపించడాన్ని, హల్దీ వేడుకలను, డీజే వినియోగాన్ని నిషేధించింది.
Also Read : పెళ్లంటే నూరేళ్ల పంటనా? మంటనా? యువతకు ఎందుకు పెళ్లిళ్లు కావడం లేదు? కారణమేంటి?
మహా శివారాత్రి సందర్భంగా..
మహా శివరాత్రి సందర్భంగా గ్రామస్తులు సమావేశమయ్యారు. మన సంస్కృతిలో భాగంగ కాని కార్యక్రమాలతో గిరిజన సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. చాలా నియమాలు పాటించడం లేదు. సంప్రదాయ విలువల కన్నా.. ప్రీ వెడ్డింగ్, హల్దీ, డ్యాన్సులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తండా వాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జరిగే ఏ పెళ్లిలో కూడా ప్రీ వెడ్డింగ్, హల్దీదోపాటు పెళ్లి తర్వాత నిర్వహించే భరాత్‌లో డీజే వాడకూడదని నిర్ణయించారు. వీటి కారణంగా స్థానికులకు ఉపాధి కూడా దొరకడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అందరి బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రీ వెడ్డింగ్ వంటి అనవసర పోకడలతో భారీగా ఖర్చు పెరగడంతోపాటు అనర్థాలకు దారితీస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అందుకే నిషేధం విధించినట్లు వెల్లడించారు.